మిర్యాలగూడ : నాగార్జున సాగర్ ( Nagarjuna Sagar ) ప్రాజెక్టు కింద సెప్టెంబర్ 14న వినాయకచవితిలోపు నీటి విడుదల షెడ్యూల్ ప్రకటించకపోతే కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) ప్రకటించారు. కేసీఆర్ పదేళ్ల పరిపాలనను, మిర్యాలగూడలో ( Miryalaguda ) గురువారం సాయంత్రం నిర్వహించిన రైతు ధర్నాలో ఆయన మాట్లాడారు.
ఎన్ని తడులకు నీళ్లు ఇస్తారు.. ఎప్పుడెప్పుడు ఇస్తారో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సాగర్‌లో నీళ్లున్నా మంత్రులకు సోయి లేదని విమర్శించారు. శ్రీశైలంలో 537 అడుగుల నీరు ఉందని కేటీఆర్ అన్నారు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా.. సాగర్‌లో నీళ్లు ఉన్నా జిల్లాలోని మంత్రులకు సోయి లేదని విమర్శించారు. సాగర్‌లో నీళ్లు ఉన్నా ఇద్దరు మంత్రులు శనిలాగా దాపురించారని వ్యాఖ్యానించారు.
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ రైతుల కళ్లలో కన్నీళ్లు పెట్టిస్తున్నారని ఆరోపించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీళ్లలో వాటర్ కలిస్తే సొరంగం కూలిపోయిందని అంటున్నారని విమర్శించారు. కళ్లు ఉండి చూడలేని మంత్రులుగా వ్యవహరిస్తున్నారని, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో నీళ్లు ఉన్నా చూడడం లేదని అన్నారు.
శ్రీశైలంలో జలవిద్యుత్ ఉత్పత్తి ద్వారా 40 నుంచి 50 టీఎంసీల నీరు సాగర్‌లోకి వచ్చిందని కేటీఆర్ తెలిపారు. శ్రీశైలంలో గేట్లు తెరిచేలోపే సాగర్‌లోకి నీళ్లు వచ్చాయని, సాగర్‌లో రెండు పంటలకు నీళ్లు వచ్చాయని అన్నారు. ఈ సీజన్లో నాగార్జునసాగర్‌లో 180 టీఎంసీల నీరు ఉన్నదని, ఆ నీటిని విడుదల చేయడానికి సంపూర్ణ అవకాశం ఉందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనను తెలంగాణ ప్రజలు చూశారని కేటీఆర్ అన్నారు. వెయ్యి రోజుల దుష్టపరిపాలన నిన్నటితో పూర్తయిందని, కేసీఆర్ పాలనలో రైతుల పరిస్థితి ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు గమనించాలని కోరారు.