రామగిరి, సెప్టెంబర్ 03 : ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను పరిరక్షించాలని, రాష్ట్రంలో సాంకేతిక విద్యను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పాలిటెక్నిక్ జాయింట్ యాక్షన్ కమిటీ (TP-JAC) ఆధ్వర్యంలో నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో 19వ రోజు భోజన విరామ సమయంలో నల్ల దుస్తులు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా TP-JAC నాయకులు, అధ్యాపకులు మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను బలహీనపరిచే చర్యలను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ వ్యవస్థను SHAKTI డిపార్ట్మెంట్లో విలీనం చేసే ప్రతిపాదనను వెంటనే నిలిపివేయాలని, విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ల్యాటరల్ ఎంట్రీ విధానాన్ని యథావిధిగా కొనసాగించాలని కోరారు. అలాగే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో మౌలిక వసతులు, నిధులు, బోధనా సిబ్బందిని పెంచి ప్రభుత్వ సాంకేతిక విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. పీపీపీ విధానం, ప్రైవేటీకరణ ప్రయత్నాలను విరమించుకోవాలని పేర్కొన్నారు.