బూర్గంపహాడ్, సెప్టెంబరు 03 : హైదరాబాద్ శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాష నిలయంలో విపంచి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ గ్రంథాలయాల ప్రారంభోత్సవంలో భాగంగా మండల పరిధిలోని ఇరవెండి పంచాయతీకి గురువారం పుస్తకాలు పంపిణీ చేశారు. ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మహ్మద్ రియాజ్, ఏనుగు నర్సింహారెడ్డి, విపంచి ఫౌండేషన్ చైర్మన్ ఏనుముల శ్రీనివాసులు, సర్పంచ్ గుండి బాబూరావు, ఉప సర్పంచ్ మహంకాళి రామారావుకు పుస్తకాలను అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలుగా మారాలని, యువత పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భూక్యా రామకృష్ణ, పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.