Abhinandan Varthaman : అభినందన్ వర్ధమాన్.. భారతీయులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. అంతులేని ధైర్య సాహసాలతో భారత యుద్ధ విమానాన్ని నడిపి.. పాక్ ఫైటర్ జెట్‌ను కూల్చిన భారత పైలట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం తన విమానాన్ని పాక్ పేల్చేయడంతో ఆ దేశంలో పారాచ్యూట్‌తో ల్యాండయ్యాడు. తర్వాత కేంద్ర ప్రభుత్వ చొరవతో విడుదలయ్యాడు.
ఇలా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) లో పైలట్‌గా సేవలందించిన గ్రూప్ కెప్టెన్, వీర్ చక్ర అవార్డు గ్రహీత అభినందన్ వర్ధమాన్ ఇప్పుడు భారత వైమానిక దళానికి గుడ్‌బై చెప్పేశాడు. అది కూడా ముందస్తు రిటైర్మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఆయన కమర్షియల్ ఫ్లైట్ పైలట్‌గా చేరారు. గోవాకు చెందిన ఎఫ్‌ఎల్‌వై91 అనే విమానయాన సంస్థలో ఆయన గత ఆగష్టులోనే విధుల్లో చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కమర్షియల్ విమానాలు నడిపే పైలట్‌గా పని చేస్తున్నారు. అయితే, ఈ అంశంపై మాట్లాడేందుకు ఆ సంస్థ నిరాకరించింది.
2019లో కాశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన దాడి గురించి తెలిసిందే. ఫిబ్రవరి 14న జరిపిన దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. దీనికి బదులుగా ఇండియా.. పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న ఉగ్రస్థావరాలపై దాడులకు దిగింది. దీంతో పాక్ కూడా భారత్‌పైకి దూసుకొచ్చింది. ఈ క్రమంలో పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్-16 విమానం భారత్‌వైపు దూసుకురాగా.. పైలట్ అభినందన్ వర్ధమాన్ తన మిగ్-21 బైసన్ అనే యుద్ధ విమానంతో ఎదురెళ్లాడు. పాక్ విమానాన్ని కూల్చివేశాడు. అయితే, వెంటనే పాక్ మరో విమానం మిగ్-21పై దాడి చేసింది. దీంతో వెంటనే పైలట్ అభినందన్ పారాచూట్ సాయంతో దూకేశాడు.
ఈ సమయంలో అతడు పాకిస్తాన్లో దిగాల్సి వచ్చింది. దీంతో అతడిని గుర్తించిన పాకిస్తాన్ సైన్యం అదుపులోకి తీసుకుంది. 60 గంటలపాటు పాక్ తన ఆధీనంలోనే ఉంచుకుంది. దీంతో అభినందన్‌ను విడిచిపెట్టాలని పాక్‌పై ఇండియాతోపాటు అంతర్జాతీయ సమాజం ఒత్తిడి చేసింది. చివరకు పాకిస్తాన్.. అభినందన్‌ను భారత్‌కు అప్పగించింది. అతడి ధైర్య సాహసాలను గుర్తించిన భారత ప్రభుత్వం అతడికి వీర్ చక్ర అవార్డు ఇచ్చింది.