తాండూర్ : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల ( Heavy Rains ) నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ( Collector Kumar Deepak ) అన్నారు. సోమవారం జిల్లాలోని తాండూర్( Tandoor ) మండలం బోయపల్లి గ్రామం ఎస్సీ కాలనీ, మండల కేంద్రంలోని రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్, నర్సాపూర్ ప్రాంతంలోని చెక్ డ్యామ్ ల వద్ద బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, తాండూర్ మండల తహసీల్దార్ జ్యోత్స్న, మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ లతో కలిసి పరిస్థితులను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. వాగులు, నదులు ఉదృతంగా ప్రవహించే సమయంలో ప్రజలను, వాహనదారులను అటువైపుగా వెళ్లకుండా పోలీసు శాఖ సమన్వయంతో బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. రహదారులు, కల్వర్టులు దెబ్బతిన్న ప్రాంతాలలో ప్రమాద సూచికలు ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.
త్రాగునీటికి ఇబ్బంది లేకుండా, వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు నష్టం జరగకుండా జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజల తక్షణ సహాయం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో కంట్రోల్ రూమ్ 08736-250501 నంబర్ ఏర్పాటు చేసి 24 గంటలు అందుబాటులో ఉంచామని వివరించారు. జిల్లాలో 90 మంది సభ్యులతో కూడిన 3 ఎస్ డీ ఆర్ఎఫ్ బృందాలు, రక్షణ పరికరాలతో తక్షణ సహాయం కోసం సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.