గజ్వేల్, మార్చి 26 : ఎనిమిదేండ్లలో ఎన్నడూ తన వరిపంట ఎండిపోలేదని, ఎప్పుడూ లేనిది ఈ యేడు సాగు చేసిన వరి ఎండిపోతే గుండె బా ధగా ఉన్నదని సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అక్కారం గ్రామానికి చెందిన రైతు బుడిగె మల్లయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. నీళ్లు లేక ఎండిపోయిన వరిపంటను బర్రెకు మేపు తూ ఆయన బుధవారం ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. రెండున్నర ఎకరాల్లో వరి సాగుచేస్తే రెండె కరాలు ఎండిపోయిందన్నాడు. నాట్లు వేసేటప్పుడు బోర్ల నుంచి నీళ్లు బాగానే వచ్చాయని, నీళ్లు వొస్తున్నయని మరింత పొలాన్ని ఇతరుల వద్ద కౌలుకు తీసుకొని నాటు వేసినట్టు చెప్పాడు. మొత్తం బోరుతోనే పారుతదని అనుకుంటే ఈ యేడు బోర్ల నీళ్లు ఎక్కువగా వస్తలేవని తెలిపాడు. కేసీఆర్ ఉండగా కాలువల్లో నీళ్లు ఎక్కువగా ఉంటే తమ ఊరి బోర్లు బాగా పోసేవని, ఈసారి కాలువల్లో నీళ్లు లేక బోర్లలో నీళ్లు తగ్గి సాగు చేసిన పొలాలు పా రుతలేవని ఆవేదన చెందాడు. రైతులందరిది ఇదే పరిస్థితి ఉన్నదని తెలిపాడు. సాగు కోసం చేసిన అప్పులు మీద పడ్డాయని పేర్కొన్నాడు. వాటిని ఎట్లా తీర్చాలో అర్థమైతలేదని వాపోయాడు.