హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): పాలనా వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే సీఎం రేవంత్ అబద్ధాలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. కోహెడలో సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ఆమె ఒక ప్రకటనలో స్పందించారు. రేవంత్‌ది క్రెడిట్ చోరీ పాలసీ అని విమర్శించారు. కోహెడలో అంతర్జాతీయస్థాయి ఫ్రూట్ మార్కెట్ నిర్మించాలని ప్రతిపాదించి, 300 ఎకరాల భూమిని సేకరించింది కేసీఆర్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. సూపర్ స్పెషాలిటీ దవాఖానను రైతుల కోసం తరలిస్తుంటే రాజకీయం చేసింది కాంగ్రెస్ నేతలు కాదా? అని నిలదీశారు. బీఆర్ఎస్ వేసిన పునాదులు, కేటాయించిన భూముల్లో నిలబడి కొబ్బరికాయలు కొట్టి, రిబ్బన్లు కట్ చేసిన రేవంత్‌రెడ్డి ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. ‘కోహెడలో మార్కెట్ కోసం బీఆర్ఎస్ కేటాయించిన స్థలంలో కాకుండా మరో ప్రాంతానికి తరలించాల్సిన అవసరం ఏమొచ్చింది..? ఆ భూమిని ఎవరికి అప్పగించాలనుకుంటున్నారు?’ అంటూ ప్రశ్నించారు. ప్రస్తుత మార్కెట్ నిర్మాణ ప్రతిపాదిత భూమికి చెందిన రైతులకు పరిహారం చెల్లించిన తర్వాతే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
అభివృద్ధి ముసుగులో పేద రైతుల భూములు గుంజుకొని రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హెచ్చరించారు. ఫార్మాసిటీని రద్దుచేసి పరిశ్రమలను వెనక్కి పంపి, రాష్ట్ర ప్రగతిని వెనక్కి నెడుతుంటే బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా బాధితుల తరఫున పోరాటం చేస్తున్నామని స్పష్టంచేశారు. గతంలో ఫార్మాసిటీలో కాలుష్యకారక పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు ఫ్యూచర్‌సిటీలో ఫార్మా కంపెనీలను అనుమతించబోమని స్పష్టంగా ప్రకటించగలరా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వచ్చిన 30 నెలల్లోనే రాష్ట్రంలో కరంట్, సాగు, తాగునీటి కటకట ఎందుకు వచ్చింది? అని నిలదీశారు. బీఆర్ఎస్ను పాతాళంలోకి తొక్కేయడం రేవంత్ తరం కాదని తేల్చిచెప్పారు. సర్కారు తప్పుడు పనులు, విధానాలపై నిలదీస్తామని మరోసారి స్పష్టంచేశారు.