కవాడిగూడ, జూన్ 7: తెలంగాణలో కుమ్మర్లకు తీరని అన్యాయం జరిగిందని అఖిల భారతీయ కుమ్మర శాలివాహన ప్రజాపతి కుంభకార్ మహాసంఘ్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవ నాగరికతకు మట్టితో పునాది వేసి సమాజ వికాసానికి ప్రాణప్రదంగా నిలిచిన కుమ్మర(శాలివాహన) సామాజిక వర్గం ఇప్పుడు ఉనికి కోసం, తమ హక్కుల కోసం ఉద్యమించాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
కుమ్మర్ల న్యాయమైన డిమాండ్ల సాధనే లక్ష్యంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిర్దొడ్డి శివానంద్ అధ్యక్షతన ఆదివారం ఇందిరా పార్కు వద్ద కుమ్మర్ల నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షా కార్యక్రమంలో బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం అధ్యక్షుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, మహాసంఘ్ ముఖ్య ప్రధాన కార్యదర్శి శిలివేరు శంకర్ప్రజాప్రతి, మన ఆలోచన సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు కటకం నర్సింగరావు, విశ్వకర్మ సంఘం నాయకులు జలందరాచారి తదితరులు పాల్గొని మద్దతు ప్రకటించారు.
వారు మాట్లాడుతూ.. కుమ్మరుల సమగ్రాభివృద్ధికోసం తెలంగాణ కుమ్మర శాలివాహన కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్‌ను తెలంగాణ కార్పొరేషన్‌గా మార్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉప్పల్ బగాయత్‌లో కుమ్మర్ల ఆత్మభవనం కోసం కేటాయించిన 3 ఎకరాల స్థలంలో భవన నిర్మాణం చేపట్టేందుకు వెంటనే 3 కోట్ల రూపాయలు కేటాయించాలన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు ఎలిశాల కృష్ణ, మహేందర్, సుదర్శన్, వీరన్న హనుమంతు, రామమూర్తి, నాథం, జానయ్య, శంకర్, నరహరి, నర్సింహ, రామకృష్ణ, దశరథ్రావు, భిక్షపతి, అనిల్‌కుమార్, యాదగిరి, వెంకటేశ్వర్లు, రామలింగం, నరేష్, ఆకారపు మల్లేష్ పాల్గొన్నారు.