Public Voice | సంపాదించేటోడు పోతే ఆ ఇల్లు ఆగమైతది. దిక్కు దివానం లేకుండ పోతది. మా ఆయన పోయినప్పుడు మా బతుకులు గిన గట్లనే ఎటూ కాకుండా అయితయనుకున్న. ఉన్నన్ని దినాలు అన్నీ ఆయనే సూస్కునే సరికి పిల్లలకు ఏదెట్ల జేయాల్నో గూడా తెల్వకపోతుండే! మా ఆయన పేరు కిష్టయ్య. 12 గుంటల జాగ ఉంది. ఏదో తిప్పలు పడి మమ్నల్ని సాదెటోడు. కిడ్నీ బీమారొచ్చి రెండేండ్లు మంచంలనే ఉన్నడు. అప్పులు చేసి పట్నం దవాఖానల సూపించినా మంచిగ కాలే! ఎన్ని పైసలు కర్సు పెట్టినా పానం దక్కలే. కరోనా టైంల కాలం చేసిండు. రేపటి సంది మా బతుకులు ఎట్ల ఎల్తయని మస్తు పరేషానైన!
మా ఊరోళ్లు దైర్నం చెప్పిండ్రు. రైతు పోతే కేసీఆర్ సారు ఐదు లచ్చలు సాయం చేస్తడని అన్నరు. ఆల్లు చెప్పినట్టే ఐదొద్దులకు జిరాయితోళ్లు అచ్చిండ్రు. పాస్ బుక్కు, ఆధార్‌కార్డు అడిగిండ్రు, కాయిదాల మీద సంతకాలు తీసుకున్నరు. వారం రోజులకు మల్లా అచ్చి నీ బ్యాంకుల ఐదు లక్షలు వడ్డయ్ సూసుకున్నవా అంటే నేను నమ్మలే. నిజంగనే నా అకౌంట్ల ఐదు లచ్చలున్నయని మా కొడుకు సూసి చెప్పిండు. రెండు లచ్చలతోని అప్పులు తేర్పినం. మూడు లచ్చలు పెట్టి ఇంటి ముందు జాగల ఇల్లు కట్టుకున్నం. కేసీఆర్ సారు చేసిన సాయం యాది మరువం. మా కిష్టయ్య ఏ లోకంల ఉన్నడో గని, ఈ పొద్దు మా బతుకులు చూసి ఆయన ఆత్మ నిమ్మలమైతది.
నానిగళ్ల పెంటవ్వ, జంగమాయపల్లి, ఎల్లారెడ్డి, కామారెడ్డి జిల్లా