న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: స్వతంత్ర దేశమైన మాల్డోవాను ఆక్రమించుకునేందుకు యూరప్ సన్నాహాలు చేస్తోందని, నాటో బలగాలు ఉక్రెయిన్‌లోని ఒడెస్సాలో కాలుమోపేందుకు సిద్ధంగా ఉన్నాయని రష్యా వార్తా సంస్థ స్పుత్నిక్ మంగళవారం తెలిపింది. ఒకప్పటి సోవియట్ యూనియన్‌లో భాగమైన మాల్డోవాలో రష్యా మద్దతుతో తిరుగుబాటు చేసేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణపై 74 మంది వ్యక్తులను మాల్డోవన్ అధికారులు అరెస్టు చేశారు.
కాగా, రష్యాతో యూరప్ యుద్ధంలో మాల్డోవా ఇప్పుడు కీలకాంశం అయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ 28న మాల్డోవాలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలను హైజాక్ చేసేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ మద్దతుతో పాట్రియాటిక్ ఎలక్టోరల్ బ్లాక్ ఎన్నికలలో రిగ్గింగ్‌కు పాల్పడుతుందన్న అనుమానంతో దాదాపు 100 మందిని అధికారులు అరెస్టు చేశారు. మాల్డోవా అధ్యక్షుడు వయా సండూకు చెందిన యాక్షన్ అండ్ సాలిడారిటీ పార్టీ ఈయూకు అనుకూలంగా వ్యవహరిస్తోంది.
ఈయూలో విలీనమా లేక రష్యాతో బంధం బలోపేతమా అన్నది ఈ ఎన్నికలతో తేలిపోతుందని అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. మాల్డోవా సరిహద్దుకు సమీపంలో నాటో సైనిక బలగాలు ఉక్రెయిన్‌లోని ఒడెస్సా ప్రాంతాన్ని స్థావరంగా మార్చుకునేందుకు సిద్ధపడుతున్నట్లు రష్యా వార్తా సంస్థ టాస్ తెలిపింది. మంగళవారం దేశవ్యాప్తంగా మాల్డోవన్ పోలీసులు 250 చోట్ల దాడులు నిర్వహించడంతో నాటో ఆక్రమణ అనివార్యమని రష్యన్ వార్తాసంస్థలు వెల్లడించాయి.