హైదరాబాద్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దించేందుకు హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ సన్నద్ధమవుతున్నారు. బీహార్‌లోని సీమాంచల్ ప్రాంతం నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు ఒవైసీ మంగళవారం ఎక్స్ వేదికగా ప్రకటించారు. బుధవారం నుంచి ఐదురోజుల పాటు బీహార్‌లో పర్యటించనున్నట్లు ఆయన వెల్లడించారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొత్త పొత్తులు ఏర్పడుతాయని సూచించారు. బుధవారం కిషన్‌గంజ్ చేరుకుంటానని, సెప్టెంబర్ 27 వరకు సీమాంచల్‌లోనే ఉంటానని ఆయన తెలిపారు. తన పర్యటన కొత్త పొత్తులకు, స్నేహాలకు దారితీయగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
సీమాంచల్‌లోని కిషన్‌గంజ్, పూర్ణియా, కటిహార్, అరారియాపై ఎంఐఎం కన్నేసినట్లు కనపడుతోంది. ఇక్కడి ప్రాంతీయ పార్టీలతో ఎన్నికల పొత్తు పెట్టుకోవాలని భావిస్తోంది. ఆయా జిల్లాలలో ముస్లిం జనాభా గణనీయంగా ఉంది. కిషన్‌గంజ్‌లో 65 శాతానికి పైగా ముస్లిం జనాభా ఉండగా కటిహార్‌లో 35 శాతానికి పైగా, పూర్ణియాలో 30 శాతం ఉంది.