HYDRAA | హైదరాబాద్ సిటీబ్యూరో/ దుండిగల్ , సెప్టెంబరు 23 (నమస్తే తెలంగాణ ): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని గాజుల రామారం భూముల వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. హైడ్రా బుల్డోజర్లు దింపితే, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అనుచరులు జేసీబీలను రంగంలోకి దింపారు. హైడ్రా వేసిన ఫెన్సింగ్‌ను ఆనవాళ్లు కూడా కనబడకుండా జేసీబీలతో తొలగించారు. అనంతరం ఫెన్సింగ్ వేసిన హద్దురాళ్ల స్థలాన్ని చదును చేశారు. హైడ్రా స్వాధీనం చేసుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే మళ్లీ కబ్జాలోకి వెళ్లి హైడ్రాకు, ప్రభుత్వానికి గాంధీ సవాల్ విసిరారు. ఇప్పుడీ వార్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గాంధీ అనుచరులు కొన్ని గంటలపాటు అక్కడ వీరంగమేసినా హైడ్రా కానీ, రెవెన్యూ, పోలీసు అధికారులు కానీ అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.
హైడ్రా అడుగులపై అనుమానాలు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజుల రామారంలోని సర్వే నంబర్ 307లోని ఫైనాన్స్ కార్పొరేషన్ భూముల్లో రౌడీషీటర్లు కబ్జాలకు పాల్పడ్డారంటూ ఈ నెల 21న హైడ్రా కమిషనర్ రంగనాథ్ బుల్డోజర్లు దింపి 260 నిర్మాణాలను కూల్చివేశారు. ఇందులో అరికెపూడి గాంధీ పేరిట 12 ఎకరాలు ఉన్నాయి. కూల్చివేతల అనంతరం ప్రగతినగర్, మిథాలినగర్ వైపు గాంధీ ఆధీనంలో ఉన్న స్థలంలో ఫెన్సింగ్ వేసి హద్దు రాళ్లు పాతారు. గాంధీ కుటుంబ సభ్యుల కబ్జాలపై మాల్కాజిగి పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తదితరులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ పిటిషన్లు విచారణకు వచ్చిన సమయంలో హైడ్రా అధికారులు కంటితుడుపు చర్యల్లో భాగంగా నిర్మాణాలు తొలగించినట్టు కూల్చివేతల సమయంలో చర్చించుకున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం మధ్యాహ్నం రంగంలోకి దిగిన గాంధీ అనుచరులు జేసీబీల సాయంతో హైడ్రా వేసిన ఫెన్సింగ్‌ను తొలగించారు.
దాదాపు 300 అడుగుల మేరలో ఫెన్సింగ్ తొలగించి కట్టలుగా చేసి అక్కడే పడేశారు. ఫెన్సింగ్ వేసినట్టు ఆనవాళ్లు కూడా లేకుండా హద్దు రాళ్ల స్థలాన్ని జేసీబీలతో చదును చేశారు. ఈ విషయంపై హైడ్రా, పోలీసు, రెవెన్యూ అధికారులను ‘నమస్తే తెలంగాణ’ సంప్రదించగా భిన్న వాదనలు వినిపించారు. కూల్చివేతలు, ఫెన్సింగ్ వరకు మాత్రమే హైడ్రాకు సంబంధం ఉంటుందని చెప్పగా, స్థలాల రక్షణ రెవెన్యూ బాధ్యత ఉంటుందని చెప్పడం గమనార్హం. రెవెన్యూ అధికారులను ఆరా తీస్తే హైడ్రా చూసుకుంటుందని, తమకేం సంబంధం లేదని చెప్తున్నారు. పోలీసుల నుంచి కూడా ఇదే జవాబు రావడం గమనార్హం. ప్రభుత్వ స్థలాల రక్షణ విషయంలో సంబంధం లేకుండానే బుల్డోజర్లు దింపిన హైడ్రా, గాంధీ మళ్లీ కబ్జాలోకి రావడాన్ని రావడంపై నోరు మెదపడం లేదు. గాంధీ అనుచరుల నుంచి వస్తున్న ఒత్తిళ్లతోనే హైడ్రా అటువైపు వెళ్లడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
హైడ్రా పక్షపాత ధోరణి
హైడ్రా పేదల విషయంలో ఒకలా, పెద్దల విషయంలో మరోలా ప్రవర్తిస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కూల్చివేసిన ప్రాంతంలోకి వెళ్లేందుకు పేదలు భయపడుతుండగా, అధికారంలో ఉన్న నేతలు సవాలు విసురుతున్నా పట్టించుకోవడం లేదు. ఏడాది క్రితం సున్నం చెరువు వద్ద సియేట్ కాలనీలో చెరువు ఎక్కడుందో కూడా తెలియకుండానే హైడ్రా ఇండ్లను కూల్చివేసింది. దీంతో సియేట్ సొసైటీ కోర్టుకెక్కింది. అలాగే, గుట్టలబేగంపేటలో చెరువు ఎక్కడుందో? ఏ సర్వే నంబర్లో హద్దులు ఉన్నాయో తెలియకున్నా హైడ్రా మాత్రం తన పని తాను చేసుకుని పోయింది. తాము కష్టపడి కొనుక్కున్న స్థలాలను కాపాడుకునేందుకు పేదలు నానాతంటాలు పడుతుంటే, అధికార పార్టీ నేతలు మాత్రం ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. కబ్జాలు ఆపాల్సిన ఎమ్మెల్యే తన కుటుంబ సభ్యుల పేర్లతో చేసిన ఈ దందాను అడుకునేదెవరని బాధితులు ప్రశ్నిస్తున్నారు.