Russia | రుద్రపూర్: ఉత్తరాఖండ్‌లోని సితర్గంజ్ తహసిల్‌కు చెందిన రాకేశ్(30) అనే యువకుడు రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ యూనివర్సిటీలో చదువుకోవడానికి వెళ్తే అతడిని సైనికుడిగా మార్చారని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా అతడి క్షేమ సమాచారాలు తెలియడం లేదని.. వెంటనే అతడిని స్వదేశానికి రప్పించాలని వారు విదేశాంగ శాఖకు లేఖ రాశారు. ఈ విషయంలో తమకు సాయం చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులను, అధికారులను కోరారు.
రాకేశ్ సోదరుడు దీపు మౌర్య కథనం ప్రకారం.. ఆగస్ట్ 7న రాకేశ్ స్టడీ వీసాతో రష్యాకు వెళ్లాడు. అదే నెల 30న రాకేశ్ తన సోదరుడితో మాట్లాడుతూ తనను బలవంతంగా రష్యా సైన్యంలో చేర్చుకొని ఉక్రెయిన్ యుద్ధంలో సైనికుడిగా పని చేయించే పరిస్థితులున్నాయని వాపోయారు. కొన్ని రోజులకు రాకేశ్ సైనిక దుస్తుల్లో ఉన్న ఫొటో అతడి కుటుంబానికి పంపారు.
ఆ తర్వాత కొన్ని రోజులకు రాకేశ్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తన పాస్‌పోర్ట్, వ్యక్తిగత పత్రాలను సీజ్ చేశారని.. తన అధికారిక ఈ మెయిళ్లను తొలగించారని తెలిపారు. తనకు డాన్బాస్ ప్రాంతంలో సైనిక శిక్షణ ఇచ్చి యుద్ధ క్షేత్రానికి పంపారని చెప్పారు. చదువు, ఉపాధి కోసం రష్యాకు వెళ్లిన పంజాబ్, హర్యానాకు చెందిన సుమారు 20 మంది భారతీయులను ఇలానే బలవంతంగా రష్యా సైన్యంలో చేర్చారని గతంలో వార్తలు వచ్చాయి.