లగచర్లలో భూ సేకరణ కోసం ప్రభుత్వం ఏ స్థాయిలో విధ్వంసం సృష్టించిందో ఎవరూ మర్చిపోలేరు. ఫార్మా కంపెనీలకు భూములు ఇవ్వబోమన్నందుకు దళిత, గిరిజన రైతులపై పోలీసు బలగాలను దింపి, దౌర్జన్య కాండకు దిగింది. రైతులకు సంకెళ్లు వేసి, జైళ్లకు పంపింది.
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లైఓవర్ల నిర్మాణానికి పది నెలల కిందట సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇప్పటివరకు భూ సేకరణ పూర్తి కాలేదు. సేకరించాల్సింది వందల ఎకరాలు కాదు, 129 నిర్మాణాలు మాత్రమే.
అందులో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నుంచి 250 చదరపు గజాలు సేకరించాల్సి ఉన్నది. ఆ స్థలం ఇవ్వాలంటూ అధికారులు ఆయన ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తాజాగా జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ జానా ఇంటికి వెళ్లి మరీ స్థలం ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న పక్షపాత ధోరణికి ఇది ప్రత్యక్ష నిదర్శనం.
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): రేవంత్ సర్కారు అడుగులు మొదటి నుంచీ పేదోళ్లు, పెద్దోళ్లు అనే స్పష్టమైన విభజన రేఖ మీద పడుతున్నాయి. హైడ్రా కూల్చివేతలైనా! భూసేకరణనైనా!!. నగరంలో నిత్యం పేదోళ్ల నిర్మాణాలు బుల్డోజర్ల కింద నలుగుతుంటే పెద్దోళ్లవి మాత్రం కోర్టు స్టేలు, రెవెన్యూ అధికారుల నివేదికల పేరిట సురక్షితంగా ఉండటమే ఇందుకు నిదర్శనం. నగర శివారులోనూ పెద్దల భూముల్ని తప్పించేందుకు రింగురోడ్డు అలైన్మెంట్లు రాత్రికి రాత్రే వంకర్లు తిరిగి పేదోళ్ల భూముల్ని కబళిస్తున్నాయి. లగచర్లలో అర్ధరాత్రి కరెంటు తీసి గిరిజన రైతుల ఇండ్ల మీద పోలీసులతో దాడి చేయించి, థర్డ్ డిగ్రీ ప్రయోగించి, సంకెళ్లతో వారిని జైలుకు పంపేదాకా ఈ ప్రభుత్వం విశ్రమించలేదు. కానీ, ప్రభుత్వానికి నగరంలో 129 నిర్మాణాలు సేకరించడం సవాల్‌గా మారింది. అక్కడ సామాన్యుల ఇండ్లు ఉంటే ప్రభుత్వం క్షణాల్లో బుల్డోజర్ల కింద నలిపివేసేది. కానీ 129 నిర్మాణాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఇల్లు కూడా ఉన్నది.
ముందుకు సాగని భూ సేకరణ
హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (హెచ్-సిటీ)లో భాగంగా రూ.1,090 కోట్లతో కేబీఆర్ పార్కు చుట్టూ ఏడు కీలక జంక్షన్లలో 4.6 కి.మీ. పొడవుతో స్టీల్ బ్రిడ్జీలు, 2.8 కి.మీ. అండర్‌పాస్‌ల నిర్మాణానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. టెండర్లు పూర్తయి ఏజెన్సీకి పనులు కూడా అప్పగించారు. అయితే భూసేకరణ మాత్రం ముందుకు సాగడం లేదు. పార్కు చుట్టూ వీవీఐపీలు, రాజకీయ, సినీ ప్రముఖల నివాసాలు, కార్యాలయాలు ఉండటమే ఇందుకు కారణం. టెండర్లు పూర్తయి ఆరు నెలలు దాటినా గజం భూసేకరణ కూడా పూర్తి కాలేదు. భూసేకరణలో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నం 12 నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు గతంలోనే పలు భవనాలను మార్కింగ్ వేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నం 92లో మాజీ మంత్రి జానారెడ్డి ఇంటి ముందు కొంత స్థలం, ప్రహరీ కలిపి దాదాపు 250 గజాల స్థలాన్ని కోల్పోనున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నం 45లో ఉన్న హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటికి కూడా మార్కింగ్ వేశారు. ఆయన 377 గజాల వరకు కోల్పోనున్నారు. ఈ జాబితాలో మాజీ మంత్రులు సమరసింహారెడ్డి, షబ్బీర్ అలీ, కేఈ కృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి, హీరో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు కూడా ఉన్నారు. ఇప్పటికే చంద్రశేఖర్‌రెడ్డితోపాటు ఓ న్యూస్ చానల్ యాజమాన్యం భూసేకరణకు వ్యతిరేకంగా న్యాయస్థానంలో ఫిటిషన్లు దాఖలు చేశారు.
జానారెడ్డి చుట్టూ ప్రదక్షిణలు
భూసేకరణలో భాగంగా అధికారులు మార్కింగ్ వేసేందుకు వెళ్లగా మాజీ మంత్రి జానారెడ్డి అధికారులతో పాటు ప్రభుత్వ ముఖ్య నేతలపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి కూడా నా ఇంటి ప్రహరీని కూలుస్తారా? మీ ముఖ్యమంత్రితో మాట్లాడతా పొండి’ అని గద్దించినట్టు సమాచారం. తాను ఎన్నో ప్రభుత్వాలను చూశానని, తన ఇంటి స్థలం ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రేవంత్‌రెడ్డి స్వయంగా జానారెడ్డి ఇంటికి వెళ్లడంపై అప్పట్లో తీవ్ర చర్చ జరిగింది. అయినా ముందుకు సాగకపోవడంతో అధికారులు కక్కలేక, మింగలేక భూసేకరణ ప్రక్రియను పక్కన పెట్టేశారు. కానీ ఫ్లైఓవర్ల ప్రాజెక్టు ముందుకుపోవాలంటే భూసేకరణ తప్పదని మంగళవారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి వెళ్లారు. లోపల ఏం జరిగిందో అధికారికంగా వెల్లడించడం లేదు. అయితే, జానారెడ్డి మాత్రం పట్టువీడటం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. జీహెచ్ఎంసీ కమిషనర్ వెళ్లి మరీ భూసేకరణపై విన్నవించిన విషయం బయటికి రాగానే పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘ప్రభుత్వం రాజధాని నగరంలో ఓవైపు పండగ పూట పేదల ఇండ్లు కూలుస్తూ, మరోవైపు తమ పార్టీకి చెందిన నేత నుంచి 250 చదరపు గజాలు తీసుకునేందుకు మాత్రం అధికారులను పంపి పదేపదే విన్నపాలు చేయిస్తున్నది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి అద్దం పడుతున్నది’ అని పలువురు విమర్శిస్తున్నారు.
అలైన్మెంట్ మారుస్తున్నారా?
ట్రిపుల్ ఆర్ గత అలైన్మెంట్ పెద్దోళ్ల భూము ల్లోంచి పోతుండటంతో, దాన్ని మార్చి బక్క రైతుల భూములను బలి చేస్తుండటంపై కొంత కాలంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదే తరహాలో కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లైఓవర్ల నిర్మాణంతో జానారెడ్డి సహా ప్రముఖుల నివాసాలను కూల్చేయాల్సి వస్తుంటం, పది నెలలుగా భూసేకరణపై అక్కడ అడుగు కూడా ముందుకు పడకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. అలైన్మెంట్ మార్చి పెద్దల ఇండ్లను సురక్షితంగా ఉంచేందుకు పావులు కదులుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే కొత్త ఆర్డీపీ ప్లాన్ తెరపైకి తీసుకువచ్చారన్న చర్చ జరుగుతున్నది. ఇదే జరిగితే ప్రముఖుల ఇండ్లు ఫ్లైఓవర్ల పక్కనే సురక్షితంగా ఉంటాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.