Russia-Ukraine War : ఉక్రెయిన్-రష్యా మధ్య కనీసం వారంపాటు కాల్పుల విరమణ (సీజ్ ఫైర్) జరగనుంది. ఈ మేరకు ఉక్రెయిన్‌పై వారంపాటు దాడి చేయబోమని రష్యా అధ్యక్షుడు పుతిన్ హామీ ఇచ్చినట్లు ట్రంప్ వెల్లడించారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆపాలని ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల అధ్యక్షులతో గతంలో పలుమార్లు చర్చలు కూడా జరిపారు. ఇటీవల యూఏఈలో కూడా ఇరు దేశాల ప్రతినిధులతో చర్చలు జరిగేలా చూశారు.
కానీ, ఏవీ ఒక కొలిక్కి రాలేదు. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా మరోసారి ఈ విషయంలో ట్రంప్ ఒక ప్రయత్నం చేశారు. కనీసం వారం రోజులపాటు యుద్ధం జరగకుండా ఒప్పించాడు. ఈ విషయంలో ట్రంప్.. ప్రత్యేకంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడారు. ప్రస్తుతం ఉక్రెయిన్ తీవ్ర చలితో వణికిపోతోంది. భారీగా మంచు పడుతోంది. అక్కడి ప్రధాన నగరాలైన కీవ్ సహా ఇతర పట్టణాల్లో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో చలి వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని యుద్ధాన్ని తాత్కాలికంగా ఆపాల్సిందిగా తాను వ్యక్తిగతంగా పుతిన్‌ను కోరినట్లు ట్రంప్ వెల్లడించాడు. తన ప్రతిపాదనకు పుతిన్ అంగీకరించాడని, వారం పాటు యుద్ధం చేయబోనని హామీ ఇచ్చాడని ట్రంప్ తెలిపారు. పుతిన్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. రెండో దశ శాంతి చర్చల గురించి కూడా పుతిన్‌తో మాట్లాడానని ట్రంప్ అన్నారు.
మరోవైపు ట్రంప్ ప్రతిపాదనపై రష్యా అధికారికంగా స్పందించలేదు. సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరినట్లు రష్యా చెప్పడం లేదు. ఇంకోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మాట్లాడుతూ.. ఇరు దేశాలు ఎనర్జీ సీజ్ఫైర్ పాటించాలన్నారు. అంటే రెండు దేశాలూ.. ఒకరిపై ఒకరు విద్యుత్, ఆయిల్ ఉత్పత్తి చేసే ప్రదేశాలపై దాడులు చేసుకోకూడదని ప్రతిపాదించారు. శక్తి, ఇంధన స్తావరాలపై దాడులు చేసుకోవడం వల్ల రెండు దేశాలూ చీకట్లో మగ్గుతున్నాయి. అందుకే జెలెన్ స్కీ ఈ ప్రతిపాదన చేశారు. దీనిపై రష్యా నుంచి ఇంకా సరైన స్పందన రాలేదు.