Heart Health | మనం హాని కలిగించవు అనుకునే అనేక అంశాలు గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. మనకు హాని చేయవు అని అనిపించే అలవాట్లు మన ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావాలను చూపుతాయి. ఆహారం తీసుకునే విషయంలో మనం చేసే పొరపాట్లు, నిద్రించే సమయంలో చేసే పొరపాట్లు, మన దినచర్యలో మనం చేసే పొరపాట్లు మన గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కానీ ఈ అలవాట్లను మనం చాలా తేలికగా తీసుకుంటాం. ఈ అలవాట్ల కారణంగా మన గుండె ఆరోగ్యం దెబ్బతింటుందన్న సంగతి కూడా మనలో చాలా మందికి తెలియదు. మన రోజువారి అలవాట్లు అసలు మన గుండె ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తాయో.. ఇప్పుడు తెలుసుకుందాం.
మన శరీరం, మనసు పనిచేయడానికి నిద్ర చాలా అవసరం. రోజూ తగినంత నిద్రించకపోవడం వల్ల రక్తపోటు, శరీర బరువు పెరగడం, మానసిక ప్రశాంతత లేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. రక్తపోటు పెరగడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి గుండె సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక రోజూ తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. రోజుకు 6 నుండి 8 గంటల పాటు నాణ్యమైన నిద్రపోవడం వల్ల గుండె ఆరోగ్యంతో పాటు శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇక మారిన జీవనశైలి కారణంగా చాలా మంది రోజంతా కూర్చోని ఉద్యోగాలు చేస్తున్నారు. కుర్చీలో అయినా, డ్రైవింగ్ సీట్ లో అయినా, సోఫాలో అయినా ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల హృదయ ఆరోగ్యం దెబ్బతింటుంది. పగటిపూట ఎక్కువ సమయం కూర్చొనే వారిలో హృదయ సంబంధ వ్యాధులు ఎక్కువగా వస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక గుండె ఆరోగ్యం దెబ్బతినడానికి ఒత్తిడి కూడా ఒక ముఖ్యకారణం.
దీర్ఘకాలిక ఒత్తిడి గుండె ఆరోగ్యంతో పాటు శరీర ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఒత్తిడి కారణంగా ఛాతిలో నొప్పి, మానసిక సమస్యలు, గుండె జబ్బులు, పేగుల ఆరోగ్యం దెబ్బతినడం వంటి అనేక సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. కనుక ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. యోగా, శ్వాస వ్యాయామాలు, ధ్యానం వంటివి చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే మన ఆహార అలవాట్లు కూడా గుండెపై ఒత్తిడి కలిగేలా చేస్తాయి. కెఫిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు, చక్కెర ఉండే ఆహారాలను తీసుకోవడంతో పాటు అల్పాహారాన్ని తీసుకోకపోవడం, వేగంగా భోజనం చేయడం వంటి అలవాట్లు కూడా గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని వైద్యులు చెబుతున్నారు.
అంతేకాకుండా మనం ఎల్లప్పుడూ అందరి కోసం కాకుండా మన శరీర ఆరోగ్యం కోసం కూడా ఆలోచించాలి. కొందరు తమ ఆరోగ్యం కంటే ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి అనారోగ్యానికి గురి అవుతారు. కనుక ఇతరులు, కుటుంబ సభ్యుల గురించి ఆలోచించడంతో పాటు మన శరీర ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా మనం హాని కలగవు అని భావించే చిన్న చిన్న విషయాలే మన హృదయ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని కనుక ఈ అలవాట్లను మానుకునే ప్రయత్నం చేయాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.