కీవ్, జూన్ 9: తమ వాయుసేన స్థావరాలను ఊహించని విధంగా దెబ్బకొట్టిన ఉక్రెయిన్‌పై.. రష్యా ప్రతీకార దాడుల్ని మరింత ఉధృతం చేసింది. ఈ యుద్ధంలో మునుపెన్నడూ లేనంతగా 479 డ్రోన్లతో ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ భీకరమైన దాడులకు దిగింది. ఉక్రెయిన్ మధ్య, పశ్చిమ ప్రాంతాలను టార్గెట్ చేస్తూ రష్యా మిలిటరీ పెద్ద సంఖ్యలో డ్రోన్ దాడులు, 20 క్షిపణి దాడులు చేపట్టినట్టు ఉక్రెయిన్ ఎయిర్‌ఫోర్స్ ప్రకటించింది. ఇందులో ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థ 277 డ్రోన్లను, 19 మిస్సైల్స్‌ను అడ్డుకుందని తెలిపింది.
గాజాకు వెళ్తున్న గ్రెటాథన్‌బర్గ్ పడవ సీజ్
జెరూసలేం : సహాయక సామగ్రితో గాజాకు వెళుతున్న పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ పడవను ఇజ్రాయెల్ దళాలు సోమవారం అడ్డుకున్నాయి. థన్‌బర్గ్‌తోపాటు, ఇతర కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నాయి. గాజాస్ట్రిప్‌లో ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న సైనిక ఆపరేషన్, మానవతా సహాయ ప్రవేశంపై ఆంక్షలను నిరసిస్తూ కార్యకర్తలు గాజాకు బయలుదేరారు. ఇజ్రాయెల్ దళాలు నిరాయుధులైన తమ కార్యకర్తలను నిర్బంధించారని ఫ్రీడమ్ ఫ్లోటిల్లా అనే సంస్థ ఆరోపించింది.