ముంబై, జనవరి 3: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ మరోసారి 83 స్థాయికి దిగజారింది. మంగళవారం ఇంకో 22 పైసలు పడిపోయి 83కు చేరింది. నిజానికి సోమవారం నష్టాల నుంచి కోలుకుని ఉదయం ట్రేడింగ్ ఆరంభంలో ఆకట్టుకున్న రుపీ.. ఆఖర్లో మాత్రం నిరాశపర్చింది. మొదట్లో 9 పైసలు బలపడి 82.69కి చేరినప్పటికీ.. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు, తరలిపోతున్న విదేశీ పెట్టుబడులతో సీన్ రివర్సైంది.
ఈ క్రమంలోనే 83 స్థాయికి క్షీణించింది. తీవ్ర ఒడిదుడుకుల మధ్య ట్రేడింగ్ ముగిసే సమయానికి 83 వద్దే స్థిరపడింది. కాగా, రూపాయి మారకం విలువ నిరుడు అక్టోబర్ 19న తొలిసారి 83.02 వద్ద ముగిసి ఆల్‌టైం కనిష్ఠాన్ని తాకింది. ఇప్పుడు మళ్లీ ఆ స్థాయి దరిదాపుల్లోకే వెళ్లడం ఆందోళనకు గురిచేస్తున్నది. సోమవారం 17 పైసలు కోల్పోయి 82.78 వద్ద రూపాయి మారకపు విలువ నిలిచిన విషయం తెలిసిందే.