Rupee Vs Dollar | ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ విలవిల్లాడుతున్నది. అమెరికా ఫెడ్ రిజర్వువడ్డీరేట్లు పెంచినా.. క్రూడాయిల్ ధర పెరిగినా.. యూఎస్ ద్రవ్యోల్బణం ఎక్కువైనా రూపాయి విలువ పతనావస్థలోకి పడిపోతున్నది. శుక్రవారం ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ రూ.82 దిగువనే కొనసాగింది.
శుక్రవారం ట్రేడింగ్‌లో 15 పైసల పతనంతో మరో ఆల్‌టైం కనిష్ట స్థాయి రూ.82.32 వద్ద ముగిసింది. దేశీయ స్టాక్ మార్కెట్లలో నెగెటివ్ ట్రెండ్‌తో శుక్రవారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో రూ.82.19 వద్ద మొదలై ఒకానొక దశలో రూ.82.43 వద్దకు చేరుకుంది. గురువారం తొలిసారి రూపాయి మారకం విలువ రూ.82 మార్క్ స్థాయికి పడిపోయింది. 55 పైసల పతనంతో గురువారం రూ.82.17 వద్ద రూపాయి స్థిర పడింది.
ఇదిలా ఉంటే ఆరు కరెన్సీల బాస్కెట్లో డాలర్ విలువ 0.19 శాతం తగ్గి 112.04కు చేరడం గమనార్హం. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 0.82 శాతం పెరిగి 95.19 డాలర్లకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురుకు డిమాండ్ బలహీన పడటంతో ఒపెక్ ప్లస్ దేశాల కూటమి క్రూడాయిల్ ఉత్పత్తి తగ్గించాలని నిర్ణయించాయి. అటుపైనే క్రూడాయిల్ ధర పెరగడం గమనార్హం.
మరోవైపు, దేశీయ స్టాక్ మార్కెట్లో ఫ్లాట్‌గా ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 30.81 పాయింట్ల పతనంతో 58,191.29 పాయింట్ల వద్ద స్థిర పడగా, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 17.15 పాయింట్ల నష్టంతో 17,314.65 పాయింట్ల వద్ద ముగిసింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) రూ.279.01 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారు.