Rukmini Vasanth | ‘సప్తసాగరాలు దాటి’ చిత్రంతో తెలుగు, కన్నడ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నటి రుక్మిణీ వసంత్ తాజాగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. తన పేరును దుర్వినియోగం చేస్తూ మోసాలు జరుగుతున్నాయని ఆమె బహిరంగంగా హెచ్చరించారు. రుక్మిణీ వెల్లడించిన వివరాల ప్రకారం, గత కొన్ని రోజులుగా ఒక వ్యక్తి 9445893273 అనే నంబర్ ద్వారా ఆమె లాగా మాట్లాడుతూ, అభిమానులను, సినీ పరిశ్రమ వ్యక్తులను, బ్రాండ్ ప్రతినిధులను మోసగించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆ వ్యక్తి తన స్వరాన్ని కూడా రుక్మిణీలా మార్చి మాట్లాడుతున్నందున చాలా మంది అయోమయానికి గురవుతున్నారని ఆమె తెలిపింది.
దీనిపై రుక్మిణీ క్లారిటీ ఇస్తూ.. ఆ నంబర్ నాది కాదు. ఆ నంబర్ నుంచి వచ్చే కాల్స్ లేదా మెసేజ్‌లకు స్పందించవద్దు. నా పేరును, స్వరాన్ని వాడి మోసాలు చేయడం సైబర్ నేరం. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాను, అవసరమైతే పోలీసు కేసులు కూడా పెడతాను అని తెలిపారు. ఆమె అభిమానులకు, సోషల్ మీడియా ఫాలోవర్స్‌కి జాగ్రత్తగా ఉండాలని, ఏమైనా అనుమానం కలిగితే తన టీమ్‌ను నేరుగా సంప్రదించమని సూచించారు. ఈ హెచ్చరిక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు రుక్మిణీకి మద్దతు తెలుపుతూ, ఇలాంటి మోసగాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
సినిమాల విషయానికి వస్తే, రుక్మిణీ ప్రస్తుతం కన్నడ స్టార్ హీరో యశ్ సరసన నటిస్తున్న ‘ టాక్సిక్’ చిత్రం షూటింగ్లో బిజీగా ఉంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో, కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. యశ్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ‘టాక్సిక్’ సినిమా సాధారణ మాస్ ఎంటర్టైనర్ కాదు. భావోద్వేగాలతో నిండి, రా అండ్ రస్టిక్ స్టైల్లో ఉండే శక్తివంతమైన కథ ఇది. ఈ ప్రాజెక్ట్‌లో భాగమవడం నాకు గర్వకారణం అని రుక్మిణీ తెలిపింది. ప్రస్తుతం రుక్మిణీ కన్నడతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా వరుస ప్రాజెక్టులపై సంతకాలు చేస్తూ సౌత్‌లో అత్యంత క్రేజీ హీరోయిన్గా నిలుస్తున్నారు.