Fan War | సోషల్ మీడియా రాకతో ఫ్యాన్ వార్ ఇప్పుడు సినిమా సంస్కృతిలో విడదీయరాని భాగంగా మారిపోయింది. ఒక హీరో గురించి మరో హీరో అభిమానులు కామెంట్ చేస్తే చాలు వెంటనే చర్చలు, వాదనలు, విమర్శలు మొదలై చివరకు తగాదాల దాకా వెళ్లడం సర్వసాధారణం. ముఖ్యంగా తమిళ సినీ పరిశ్రమలో అజిత్ కుమార్, విజయ్ అభిమానుల మధ్య జరుగుతున్న వార్ ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటుంది. వీరి సినిమాలు విడుదలైన రోజున థియేటర్ల వద్ద అభిమానుల సందడి పండగలా ఉంటుంది. కానీ ఆ ఉత్సాహమే కొన్నిసార్లు ఆన్లైన్లో తగాదాలుగా మారుతుంది. నిజంగా అజిత్, విజయ్ మధ్య శత్రుత్వం ఉందా? లేక అభిమానులే సృష్టించుకున్న ఊహాగానాలా? అనే ప్రశ్నకు అజిత్ చివరికి సమాధానం ఇచ్చారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో అజిత్ మాట్లాడుతూ, “విజయ్‌తో నాకు ఎలాంటి విభేదాలు లేవు. కొంతమంది కావాలని మా మధ్య అపార్థాలు సృష్టిస్తున్నారు. అవి పూర్తిగా తప్పుడు వార్తలు. అభిమానులు వాటిని నమ్మి ఒకరినొకరు దూషించడం అనవసరం. విజయ్ నాకు సోదరుడిలాంటి వాడు. అతనికి ఎల్లప్పుడూ మంచి జరగాలని కోరుకుంటాను. గొడవలు కాకుండా సంతోషంగా జీవించడం నేర్చుకోండి,” అని అభిమానులకు సూచించారు. విజయ్ రాజకీయ రంగ ప్రవేశం నేపథ్యంలో ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలను కూడా అజిత్ ఖండించారు. “మా మధ్య విషం చిమ్మే ప్రయత్నాలు చేయవద్దు,” అని ఆయన హెచ్చరించారు.
గమనించదగ్గ విషయం ఏమిటంటే కోలీవుడ్‌లో ఈ ఇద్దరు హీరోలు ఎప్పటినుంచో స్నేహపూర్వక సంబంధం కొనసాగిస్తున్నారు. విజయ్ కూడా గతంలో ఒక అభిమాని తెచ్చిన అజిత్–విజయ్ ఫోటోపై సిగ్నేచర్ పెట్టి తమ బాండింగ్‌ని చూపించాడు. ఆ క్షణం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇటీవల అజిత్‌కు పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు విజయ్ శుభాకాంక్షలు చెప్పలేదని వచ్చిన రూమర్స్‌పై అజిత్ మేనేజర్ స్పందిస్తూ, “ఆ వార్తలు తప్పు. అవార్డు ప్రకటించిన వెంటనే విజయ్ ఫోన్ చేసి అభినందించాడు. వాళ్లిద్దరూ ఎప్పటినుంచో మంచి స్నేహితులే,” అని క్లారిటీ ఇచ్చారు. కోలీవుడ్‌లో హీరోలను దేవుళ్లలా చూసే అభిమానులు తమ హీరోకే ప్రాధాన్యం ఇస్తూ ఇతరులను విమర్శించడం తరచూ జరుగుతుంది. కానీ వాస్తవానికి అజిత్–విజయ్ ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకునే స్టార్లు. ఇటీవల విజయ్ సభలో జరిగిన తొక్కిసలాట ఘటనపై కూడా అజిత్ ఆయనకు మద్దతుగా నిలిచారు. మరి అజిత్ ఇచ్చిన ఈ క్లారిటీతో ఫ్యాన్ వార్కి బ్రేక్ పడుతుందా? లేదా చూడాలి.