లక్నో: జాతీయ స్థాయి మెడిసిన్ ప్రవేశపరీక్ష అయిన నీట్‌కు (NEET) సన్నద్ధమవుతున్న ఓ విద్యార్థి బలవన్మరణం (NEET Student) చెందారు. అమ్మా నాన్న నన్ను క్షమించడం అంటూ సూసైడ్ నోట్ రాశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది.
రామ్‌పూర్‌కు చెందిన మహ్మద్ ఆన్ (21) అనే యువకుడు రావత్పూర్లోని హాస్టల్లో ఉంటూ నీట్‌కు ప్రిపేరవుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం రూమ్మేట్ అయిన ఇమ్మద్ హసన్.. ప్రేయర్‌కు వెళ్దామని ఆన్‌ను అడిగాడు. అయితే రానని సమాధానం చెప్పడంతో అతడు ఒక్కడే ప్రేయర్‌కు వెళ్లాడు. తిరిగి గదికి వచ్చి చూస్తే తలుపునకు లోపలి నుంచి గడియ పెట్టి ఉన్నది. ఎంతకూ తీయకపోవడంతో పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులను బద్దలుకొట్టి లోపలికి వెళ్లి చూడగా.. మహ్మద్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉన్నాడు. అక్కడ దొరికిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ‘అమ్మా నాన్న.. దయచేసి నన్ను క్షమించండి. నేను చాలా ఒత్తిడిలో ఉన్నాను, మీ కలలను నేను నెరవేర్చలేను. నా ప్రాణాన్ని నేనే తీసుకుంటున్నాను. దీనికి నేనే బాధ్యత వహిస్తున్నా’ అని రాసి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.