– ఈవీ బస్సులను ఆర్టీసీ ఆధ్వర్యంలోనే నడపాలని డిమాండ్
నల్లగొండ సిటీ, మార్చి : టీజీఎస్ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్లగొండ డిపో జేఏసీ ఆధ్వర్యంలో ప్రైవేట్ విద్యుత్ బస్సుల విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆర్టీసీ కార్మికులు సోమవారం అర్ధనగ్న ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా గో బ్యాక్ గోబ్యాక్ – ఈవీ బస్సులు గో బ్యాక్.. ఆర్టీసీ స్థలాల్లో- ఆర్టీసీ బస్సులే ఉండాలి.. ఆర్టీసీ బస్సులే ఉండాలి- ఆర్టీసీ సిబ్బందే నడపాలి.. ఆర్టీసీ స్థలాల నుండి- ప్రైవేట్ ఈవీ బస్సులు వెళ్లగొట్టాలే.. వద్దురా నాయనా – ప్రైవేట్ బస్సులు.. ముద్దురా నాయనా- ఆర్టీసీ బస్సులు అంటూ నినాదాలిస్తూ అర్ధనగ్న ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర నాయకులు బి.నరేందర్, బాసాని వెంకటయ్య, జిల్లా జేఏసీ నాయకులు ఎన్ఆర్సీ రాజు, టీజే రావు, డిపో జేఏసీ నాయకులు ఏఎల్ స్వామి, ఎండీ అన్వర్, ఎస్సీ, ఎస్టీ నల్లగొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కేఎల్ నాయక్, కడియం రమేశ్ పాల్గొని మాట్లాడారు.
ప్రభుత్వమే ఈవీ బస్సులని కొనుగోలు చేసి ఆర్టీసీలకు ఇవ్వాలని, ఆర్టీసీ ఆధ్వర్యంలోనే నడపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ప్రైవేట్ ఈవీ బస్సులను తీసుకుని, పూర్తిగా ప్రైవేట్ వారికి అప్పగించి, కొత్త నియామకాలు చేపట్టకుండా పూర్తిగా సంస్థను నిర్వీర్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను, మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం, యాజమాన్యం అనుసరిస్తున్న విధానాల పట్ల రాష్ట్ర జేఏసీ సమ్మె నోటీసు ఇచ్చిందని, ఇక ముందు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే అన్ని పోరాటాల్లో పాల్గొని విజయవంతం చేసి అన్నింటిని సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు ఎన్.సైదులు, కె.అంజయ్య, టీఎస్.రెడ్డి, కేఎల్.రెడ్డి, ఎస్ఆర్ రెడ్డి, సీహెచ్ వెంకన్న, ఎండీ లతీఫ్, ఎం.లక్ష్మయ్య పాల్గొన్నారు.