మధిర/ మయూరిసెంటర్, జూన్ 1 : ఆర్టీసీ కార్మికులకు నష్టం కలగకుండా ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ స్టాఫ్ అండ్ వరర్స్ ఫెడరేషన్(ఎస్‌డబ్ల్యూఎఫ్), టీఎంయూ రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు కార్మికులు ఖమ్మం, మధిర డిపోల ఎదుట బ్యాడ్జీలు ధరించి సోమవారం నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా టీఎంయూ జిల్లా చైర్మన్ మేరుగు రవీంద్రనాథ్, పలువురు నాయకులు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చి హామీ మేరకు కార్మికుల విలీన ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, ఇందుకోసం ఏర్పాటు చేసే కమిటీలో అన్ని రిజిస్టర్డ్ కార్మిక సంఘాలను భాగస్వాములను చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే రిటైర్డ్ కార్మికులకు చెల్లించాల్సిన అన్ని రకాల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల అలవెన్స్ పెంపుదలపై ప్రభుత్వం సర్క్యులర్ విడుదల చేసి, జూనియర్ అసిస్టెంట్ పోస్టులతోపాటు ఖాళీగా ఉన్న అన్ని రకాల పోస్టులను పదోన్నతులతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
కార్మికుల హక్కులను కాపాడుకునేందుకు పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మధిర ఎస్‌డబ్ల్యూఎఫ్ ముఖ్య నాయకులు జె.పద్మావతి, సీహెచ్.కోటయ్య, జోగేశ్వరరావు, టీసీఎన్ రెడ్డి, నాగరాజు, వెంకటలక్ష్మి, టి.పద్మావతి, జె.కోటేశ్వరరావు, ఖమ్మం టీఎంయూ నాయకులు, ఎస్‌డబ్ల్యూఎఫ్ జిల్లా కార్యదర్శి పిట్టల సుధాకర్, నాయకులు వినోద్‌కుమార్, ఉప్పలయ్య, జ్యోతి, శ్రీదేవి, మంజుల, అప్పారావు, బాబు, సురేశ్, గుర్రం రామారావు తదితరులు పాల్గొన్నారు.