సిటీబ్యూరో: నిబంధనలకు విరుద్ధంగా నగరంలోకి ప్రవేశించి ప్రధాన మార్గాల్లో ట్రావెల్ బస్సులు ఎక్కడికక్కడ గంటల తరబడి నిలిపివేస్తుండటంతో ట్రాఫిక్ సమస్య జఠిలమవుతుంది. జేఎన్టీయూ, కూకట్పల్లి, పంజాగుట్ట, ఖైరతాబాద్, దిల్సుఖ్నగర్ తదితర ప్రాంతాల ప్రధాన రహదారులన్నీ ట్రావెల్స్ బస్సులతో రద్దీని తలపిస్తుంటాయి. ఒక్క బస్సు ఆగిందంటే దాని వెనుకాల వందలాది వాహనాలు నిలిచిపోవాల్సిన పరిస్థితి ఉంది. సాధారణంగా నగరంలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వ్రైవేట్ ట్రావెల్స్ బస్సులు రాకపోకలు సాగించకూడదని నిబంధనలు చెబుతున్నాయి.
లారీలు, జేసీబీలకు ఉదయం 7 నుంచి రాత్రి 11 వరకు అనుమతి లేదు. నిర్మాణ వ్యర్థాలు, వస్తువులు తరలించే 2 నుంచి 6 టన్నుల బరువు గల వాహనాలు, చిన్న పరిమాణంలో ఉంటే టిప్పర్లు ఉదయం 9 నుంచి 11:30 గంటల మధ్య, సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల మధ్య సిటీ పరిధిలో తిరగకూడదు. కానీ నిబంధనలు ఉల్లంఘిస్తూ చాలామంది డ్రైవర్లు ఇష్టానుసారంగా నగరంలో రాకపోకలు సాగిస్తున్నారు. ఇటీవల ఆర్టీఏ అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తున్న 11 ట్రావెల్ బస్సులపై కేసులు నమోదు చేశారు. భవిష్యత్లో మరిన్ని దాడులు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.