‘ప్రభుత్వం ఈ ఏడాదైనా ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తుందా? ఇవ్వదా? ఒకవేళ ఇవ్వకపోతే లక్షల రూపాయల ఫీజులు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? ఉన్నత చదువులు ఎలా కొనసాగించాలి?’ ఇదీ ప్రస్తుతం రాష్ట్రంలో లక్షలాది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న ప్రశ్న. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో విద్యార్థులు ప్రస్తుతం ఎదుర్కొంటున్నంత మానసిక ఒత్తిడిని మునుపెన్నడూ చవిచూడలేదని విద్యార్థి సంఘాల నేతలు చెప్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను బకాయి పెట్టడం ఒకటైతే, ఈ ఏడాది నుంచి చెల్లింపుల విధానంలో మార్పులు చేయడం మరొకటి! ఇప్పటిదాకా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను ప్రభుత్వం నేరుగా కాలేజీలకే చెల్లిస్తున్నది. ఈ విద్యా సంవత్సరం నుంచి కాలేజీలకు కాకుండా విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తామని, వాటిని వారు వారం రోజుల్లోగా కాలేజీలకు చెల్లించాలని, అలా చేయకపోతే విద్యార్థుల మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగిస్తామంటూ రేవంత్ సర్కార్ జీవో జారీ చేసింది. ఈ నూతన విధానం ఏ పరిణామాలకు దారితీస్తుందోనన్న ఆందోళన విద్యార్థుల్లో నెలకొన్నది. ఇది ఫీజు రీయింబర్స్మెంట్ క్రమంగా ఎత్తివేసే కుట్రగా వివిధ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత 2023-24, 2024-25, 2025-26 అంటే మూడు విద్యా సంవత్సరాలు ముగిసి పోయాయి. నాలుగో విద్యా సంవత్సరం 2026-27 కూడా ప్రారంభమైంది. రేవంత్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వేళ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరంలో ఉన్న విద్యార్థులు ఇప్పుడు ఫైనలియర్‌కు చేరారు. కానీ, ఆయా విద్యార్థుల తరఫున కాలేజీ యాజమాన్యాలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను చెల్లించలేదు. దీంతో కాలేజీల నిర్వహణ కష్టంగా మారుతున్నదని, అధ్యాపకులు, సిబ్బందికి వేతనాలు చెల్లించలేపోతున్నామని యాజమాన్యాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. దీంతో ప్రభుత్వం బకాయిపడ్డ ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని విద్యార్థులే చెల్లించాలని, లేదంటే ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇచ్చేది లేదని చెప్తున్నాయి. మరికొన్ని కాలేజీలు ప్లేస్‌మెంట్స్‌కు సంబంధించిన ‘ప్రత్యేక శిక్షణ తరగతులకు’ కూడా తమను నిరాకరిస్తున్నాయని ఫీజు రీయింబర్స్మెంట్ క్యాటగిరీ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి, ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ప్రపంచ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో జాబ్ మార్కెట్ చాలా డల్‌గా ఉన్నదని, కార్పొరేట్ కంపెనీలు మునుపటిలా ‘క్యాంపస్ సెలక్షన్స్’ చేపట్టడం లేదని, వందల మందిని రాతపరీక్షలు, ఇంటర్వ్యూలకు పిలిచి కాలేజీకి ఒకరినో ఇద్దరినో రిక్రూట్ చేసుకొంటున్నాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలలో రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం ఇప్పుడు దాదాపు పది పన్నెండు లక్షల కుటుంబాలకు సమస్యాత్మకంగా మారుతున్నది. కాలేజీ యాజమాన్యాలు మెడ మీద కత్తి పెడుతుండటంతో అధిక వడ్డీలకు అప్పులు చేసి, ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితిని అనేక కుటుంబాలు ఎదుర్కొంటున్నాయి. ఇది ఆయా కుటుంబాలను ఆర్థిక సంక్షోభంలోకి ఈడ్చుకెళ్తున్నది. నిజానికి, ఉమ్మడి రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్ సర్కార్. వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి హ్యూమన్ ఫేస్‌ను ఇచ్చిన విశిష్ట పథకాల్లో ప్రధానమైనవి ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ! ఆ సత్సంప్రదాయాన్ని రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వాలు కూడా ఎటువంటి భేషజాలకు పోకుండా కొనసాగించాయి.
ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం బకాయి పెట్టిన రెండేండ్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను సైతం కేసీఆర్ సర్కార్ క్లియర్ చేసింది. కేసీఆర్ మరో అడుగు ముందుకేసి, విదేశీ విద్యానిధి పథకం కింద అల్పాదాయ వర్గాల వారు సైతం విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు చేయూతనందించారు. రేవంత్‌రెడ్డి సర్కార్ కొలువుదీరిన తరువాత ఆయా పథకాలకు గ్రహణం పట్టిందని, నాలుగేండ్ల ఫీజుల బకాయిలు పేరుకొనిపోయాయని విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దాదాపు ఇరవై ఏండ్లపాటు ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిన ఈ పథకం అనేక ప్రయోజనాలు ఇచ్చింది. నిరుపేద కుటుంబాల నుంచి సైతం లక్షలాది మంది యువ ఇంజినీర్లు, వేలాది డాక్టర్లు తయారవ్వడానికి దోహదపడింది.
హైదరాబాద్‌లో విస్తరిస్తున్న ఐటీ పరిశ్రమకు అవసరమైన వృత్తి నిపుణులను స్థానికంగానే అందించింది. తీవ్రవాద సంస్థల వైపు ఆకర్షితులు కాకుండా విద్యార్థులను నిరోధించింది. తద్వారా శాంతిభద్రతల పరిరక్షణకు పరోక్షంగా ఉపకరించింది. తమ బిడ్డల ఉన్నత చదువులకు అయ్యే వ్యయం తగ్గడం, ఆ మేరకు అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సిన దురవస్థ తప్పడంతో రైతుల ఆత్మహత్యలు కూడా తగ్గుముఖం పట్టాయి.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రాధాన్యత, లక్షలాది కుటుంబ ఆర్థిక వ్యవస్థల మీద, హైదరాబాద్ ఐటీ రంగానికి అవసరమైన నిపుణులను అందించడంలోనూ అది చూపిన ప్రభావం అర్థం కాలేదో ఏమో గానీ, దానిని నిర్లక్ష్యం చేస్తున్నారు. ‘విద్యార్థుల చదువుల మీద పెట్టేది ఖర్చు కాదు..వారి భవిష్యత్తుతోపాటు రాష్ట్ర, దేశ భవిష్యత్తు కోసం చేస్తున్న ఇన్వెస్ట్మెంట్!’ అనే స్పృహతో ప్రభుత్వాలు వ్యవహరించాలి. నిజానికి, ఇప్పుడు టెక్నాలజీ రంగం కొత్త పుంతలు తొక్కుతున్నది. ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నవారు సైతం కొత్త టెక్నాలజీకి అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాల్సిన దశ నడుస్తున్నది. ఇలాంటి సమయంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు జాబ్ మార్కెట్ డిమాండ్లకు అనుగుణంగా కొత్త టెక్నాలజీని అప్డేట్ చేసుకొంటూ, విద్యార్థుల నైపుణ్యాలకు మరింత మెరుగులు దిద్దాల్సిన ఆవశ్యకత ఏర్పడుతున్నది.
నాలుగేండ్లపాటు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను బకాయిపెట్టి, ఇప్పటికైనా ఇస్తరో, లేదో, ఇస్తే గిస్తే ఎప్పుడిస్తరో, ఎంత ఇస్తరో తెలియని అయోమయ పరిస్థితులు ఉంటే ఆయా కాలేజీలు కొత్త టెక్నాలజీకి అప్డేట్ అవ్వడం సాధ్యమవుతుందా? విద్యార్థులు సైతం నైపుణ్య శిక్షణ మీద వంద శాతం దృష్టిని కేంద్రీకరించగలరా? విద్యార్థుల భవిష్యత్తు పట్ల బాధ్యత గల ప్రభుత్వాలు ఆలోచించాల్సింది..వారి కోసం పెడుతున్న ఖర్చు ఎలా తగ్గించుకోవాల్నా? అని కాదు; ప్రపంచంతో పోటీ పడేందుకు మరింత నాణ్యమైన విద్యను ఎలా అందించాల్నా అని!
– కందిబండ కృష్ణప్రసాద్ 9182 777 010