రాంచీ: ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. జార్ఖండ్‌లోని బిష్ణుపూర్‌లో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఆశకు అంతు లేదు. మనిషి ఇంకా ఇంకా కోరుకుంటడు. కొందరు సూపర్‌మ్యాన్ అవ్వాలనుకుంటరు. అక్కడితో ఆగిపోరు. తర్వాత దేవత అవ్వాలని ఆశపడుతరు. అంతటితో ఊరుకోరు. భగవంతుడిగా మారాలని కోరుకుంటరు. కానీ భగవంతుడు తనను తాను సర్వాంతర్యామిగా చెప్తారు. ఆ విశ్వరూపుడిని మించింది ఇంకా ఏదైనా ఉందా అనేది ఎవ్వరికీ తెలియదు.
కార్యకర్తలు దీనిని అర్థం చేసుకోవాలి’ అని అన్నారు. అయితే, భాగవత్ చేసిన వ్యాఖ్యలు ప్రధాని మోదీని ఉద్దేశించినవేనని కాంగ్రెస్ అంటున్నది. ఇటీవల లోక్‌సభ ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడుతూ.. ‘మా అమ్మ చనిపోయిన తర్వాత.. నేను దైవాంశ సంభూతుడిని అని నాకు అనిపించింది. నాకు ఈ శక్తులను భగవంతుడే అందించాడు. నేను ఆ దేవుడి దూతనే తప్ప మరొకటి కాదు’ అని అన్నారు. దీన్ని ఉద్దేశించే భాగవత్ వ్యాఖ్యానించినట్టుగా కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ట్వీట్ చేశారు. ‘లోక్ కల్యాణ్‌మార్గ్ లక్ష్యం గా జార్ఖండ్ నుంచి నాగ్‌పూర్ పేల్చిన తాజా అగ్ని క్షిపణి గురించిన వార్త స్వయంప్రకటిత మానవాతీత ప్రధానమంత్రికి తెలిసే ఉంటుంది’ అని జైరామ్ ట్వీట్ చేశారు.