పెంచికల్ పేట్ : మండలంలోని అగర్గూడకు చెందిన రాజశేఖర్ కుటుంబాన్ని బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్( RS Praveen Kumar ) బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చారు. హత్యకు( Murder) గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హత్య ఘటన చోటుచేసుకుని నెలరోజులు కావస్తున్నా ఇంతవరకు కేసు పురోగతి లేదని అసహనం వ్యక్తం చేశారు.
నిందితుడు బెయిల్ మీద బయటకి వచ్చాడని, సాక్షులను బెదిరింపులకు గురిచేసే ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు విచారణలో జాప్యం చేస్తున్నారని, ఇప్పటివరకు సాక్షుల వాంగ్మూలం సేకరించలేదని ఆరోపించారు. కేసులో కీలకమైన ఆధారాలు, సాక్షులు, రాజశేఖర్ మరణ వాంగ్మూలం ఉన్నా, కేసులో జాప్యం ఎందుకు జరుగుతుందని ప్రశ్నించారు.
రాజశేఖర్ ఆత్మహత్యకు కారణం కృష్ణతో పాటు ఆయన సతీమణి పాత్ర కూడా ఉందని బాధితులు ఆరోపిస్తున్నా అధికారులు ఎందుకు ఆమెపై కేసు పెట్టడం లేదని నిలదీశారు. పేద కుటుంబానికి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. ఆయన వెంట కార్యకర్తలు షరీఫ్, బాబాజీ, దేవాజీ, నవీన్, అనూప్ తదితరులు పాల్గొన్నారు.