పోక్సో కేసు పెట్టారనే కక్షతో రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఆరుగురిని హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ క్రమంలో బాధిత కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
షాబాద్ మండలం దైవాలగూడకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని చేవెళ్ల వదవ్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పట్నం నరేందర్ రెడ్డిని శంకర్పల్లి వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఇక పటోళ్ల కార్తీక్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు.
2018లో సరిత అనే మహిళను రాజ్‌కుమార్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. అయినప్పటికీ మరో మైనర్ బాలికను ప్రేమ పేరుతో రాజ్‌కుమార్ వేధించసాగాడు. ఈ విషయం తెలిసిన బాలిక తల్లి ఆమెను కాలేజీకి పంపించకుండా ఇంట్లోనే ఉంచింది. ఈ క్రమంలో ఒకసారి పరీక్షల కోసం బాలిక కాలేజీకి వెళ్లినప్పుడు.. ఆమెను బలవంతంగా లాక్కెళ్లేందుకు యత్నించాడు. అప్పుడు ఆమె తల్లి చాకచక్యంగా వ్యవహరించి నిందితుడి నుంచి బాలికను తప్పించింది.
అప్పటి నుంచి బాలికపై రాజ్‌కుమార్ పలుమార్లు బెదిరింపులకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. మీ నాన్నను ఎలా చంపేశారో.. మిమ్మల్ని కూడా అలాగే చంపేస్తానని బాధితురాలి కుటుంబాన్ని గతంలో బెదిరించాడని అంటున్నారు. అయితే నిందితుడు బహిరంగంగా తిరుగుతూ బెదిరింపులకు పాల్పడుతున్నా.. పోక్సో కేసు నమోదైనప్పటికీ బాలికకు ఎలాంటి రక్షణ కల్పించలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యమే ఈ ఉదందతానికి ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు. గతంలో భూతగాదాలో ఇద్దరిని బెదిరించినందుకు రాజ్‌కుమార్‌పై గతంలోనే రెండు ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు సమాచారం.
మరోవైపు పోక్సో కేసులో కేవలం ఏడేళ్లు మాత్రమే శిక్షపడేలా తేలికపైన సెక్షన్లను పోలీసులు జత చేయడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనివల్ల కేవలం రూ.20వేల పూచీకత్తుతో రెండు నెలల్లోనే బెయిల్ వచ్చిందని.. దీనివల్లే బయటకు వచ్చిన రాజ్‌కుమార్ ఆరుగురిని కిరాతంగా హత్య చేశాడని స్థానికులు మండిపడుతున్నారు.