Thamizh Murugan | దక్షిణాది సినీ పరిశ్రమలో దైవిక, పురాణ గాథల నేపథ్యానికి నయా క్రేజ్ మొదలైంది. ఒకప్పుడు పౌరాణిక కథలకు కేరాఫ్ అడ్రస్‌గా కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలు మళ్లీ అదే బాట పట్టినట్లు తెలుస్తున్నాయి. ప్రస్తుతం తమిళ, తెలుగు సినీ రంగాలలో లార్డ్ మురుగన్ (సుబ్రమణ్య స్వామి) కాన్సెప్ట్ ఒకవైపు భారీ ట్రెండ్‌గా మారుతుండగా, మరోవైపు ఇండస్ట్రీల మధ్య సరికొత్త వివాదానికి మరియు ఇగో వార్కి దారితీస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖ దర్శకులు, అగ్ర హీరోలు మురుగన్ బ్యాక్‌డ్రాప్‌లో ప్రతిష్టాత్మక చిత్రాలను ప్రకటించడం సోషల్ మీడియా వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది.
శివకార్తికేయన్ ‘సేయోన్’

Siva Karthikeyan
ఈ ట్రెండ్‌ను మొదటిగా కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ ప్రారంభించాడు అని చెప్పవచ్చు. శివకార్తికేయన్ పుట్టినరోజు పురస్కరించుకుని విడుదలైన ఒక గ్లింప్స్ ఇటీవలే అందరి దృష్టిని ఆకర్షించింది. శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో లోకనాయకుడు కమల్ హాసన్ భారీ నిర్మాణంలో, శివకుమార్ మురుగేశన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘సేయోన్’ (Seyon) అనే చిత్రం ఈ మురుగన్ సెంటిమెంట్‌కు పునాది వేసింది. తమిళ ప్రాచీన సంస్కృతి, సాహిత్యంలో కార్తికేయుడిని ‘సేయోన్’ అని పిలుస్తారు. ఈ చిత్ర గ్లింప్స్‌లో శివకార్తికేయన్ విరుమాండి స్వామి పూనకం వచ్చినట్లుగా, అత్యంత ఊరమాస్ లుక్‌లో పల్లెటూరి జాతర నేపథ్యంలో కనిపించి అభిమానులను అలరించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ యాక్షన్ డ్రామాను అక్టోబర్ 2026లో గ్రాండ్‌గా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’

అయితే ఇది ట్రెండింగ్‌లో ఉండగానే టాలీవుడ్ నుండి వచ్చిన ఒక అనౌన్స్మెంట్ అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు తీవ్ర వివాదాల్లోకి నెట్టింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఒక భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. ఈ చిత్రానికి ‘గాడ్ ఆఫ్ వార్’ (God of War) అనే టైటిల్ విస్తృతంగా ప్రచారంలో ఉంది. దీంతో ఈ ప్రాజెక్ట్ కూడా మురుగన్ జీవితంపై రాబోతుండడంతో టాలీవుడ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ సినిమా ప్రకటన సమయంలో నిర్మాత నాగవంశీ సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ తీవ్ర వివాదానికి దారితీసింది. మురుగన్ స్వామి “ఉత్తరాదిన జన్మించాడు.. దక్షిణాదిన పూజించబడుతున్నాడు” అంటూ ఆయన పేర్కొన్న వ్యాఖ్యలపై తమిళనాడులో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తమిళులు తమ ప్రాచీన దేవుడైన ‘తమిళ్ కడవుల్’ (తమిళ దేవుడు) మురుగన్‌ను ఉత్తరాది మూలాలతో ముడిపెట్టడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ వివాదం రాజకీయ రంగు కూడా పులుముకుంది. ‘నామ్ తమిళర్ కట్చి’ (NTK) పార్టీ అధినేత, నటుడు-దర్శకుడు సీమాన్ స్పందిస్తూ.. ఈ చిత్రం తమిళుల సాంస్కృతిక మనోభావాలను, చరిత్రను దెబ్బతీసేలా ఉంటే తమిళనాడులో అడుగుపెట్టనివ్వబోమని, థియేటర్లలో ప్రదర్శనలను అడ్డుకుంటామని బహిరంగంగా హెచ్చరించారు. అయితే టాలీవుడ్ నిర్మిస్తున్న ఎన్టీఆర్ సినిమాపై ఈ రకమైన రాజకీయ, ప్రాంతీయ దుమారం రేగుతున్న తరుణంలోనే, కోలీవుడ్ నుండి దానికి గట్టి కౌంటర్ అన్నట్లుగా ఒక సంచలన ప్రకటన వెలువడింది.
ధనుష్ ‘తమిళ్ మురుగన్’

Tamizh Murugan
జులై 10న జాతీయ అవార్డు గ్రహీతలు ధనుష్ మరియు వెట్రిమారన్ కాంబినేషన్లో 5వ చిత్రంగా ‘తమిళ్ మురుగన్’ (Thamizh Murugan) ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్‌లో ధనుష్ ఒక భారీ ఏనుగుపై గంభీరంగా కూర్చొని, చేతిలో మురుగన్ స్వామి యొక్క శక్తివంతమైన ఆయుధం ‘వేల్’ (ఈటె) పట్టుకుని, ఒక భారీ సైన్యం ముందు తమిళ ప్రజలకు, ఆ నేలకూ రక్షకుడిగా కనిపించారు. ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా వివాదానికి గట్టి సమాధానం ఇవ్వడానికి, మురుగన్ స్వామి యొక్క అసలైన తమిళ మూలాలను మరియు ప్రాంతీయ అస్తిత్వాన్ని చాటిచెప్పడానికే దర్శకుడు వెట్రిమారన్ ఈ కౌంటర్ ప్రాజెక్ట్‌ను లైన్లోకి తెచ్చారని ఇండస్ట్రీ వర్గాలతో పాటు నెటిజన్లు బలంగా భావిస్తున్నారు. అయితే ఒకప్పుడు భక్తిరస చిత్రాలుగా వచ్చిన దేవుళ్ల కథలు, ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామాలుగా, అలాగే ప్రాంతీయ అస్తిత్వానికి ప్రతీకలుగా మారుతున్నాయి. మురుగన్ చుట్టూ తిరుగుతున్న ఈ ఇండస్ట్రీల వార్ రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి!