Ayodhya : అయోధ్య రామాలయానికి సంబంధించిన విరాళాల మాయం కేసు విచారణ కొనసాగుతోంది. తవ్వుతున్న కొద్దీ ఇందులోని అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా మరో విలువైన కానుక విషయంలో దాత సందేహాలు లేవనెత్తారు. తాము అందించిన రూ.5 కోట్ల విలువైన బంగారం తాపడం కలిగిన రామచరిత మానస్ కనిపించడం లేదని దాత, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ లక్ష్మీ నారాయణన్ చెప్పారు. ఈ అంశంపై లక్ష్మీ నారాయణన్ మాట్లాడుతూ.. తాను, తన కుటుంబ సభ్యులతో కలిసి 2024 ఏప్రిల్‌లో రామాలయం బాధ్యతలు చూసే శ్రీ రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టుకు దాదాపు రూ.5 కోట్ల విలువైన బంగారు తాపడం కలిగిన రామచరిత మానస్‌ను విరాళంగా అందించినట్లు చెప్పారు.
తర్వాత ఈ కానుక కొంతకాలం దేవాలయంలో అందరికీ కనిపించేలా ఉంచారు. మరికొంతకాలం తర్వాత నుంచి ఈ రామచరిత మానస్ కనిపించడం లేదని, అక్కడినుంచి తొలగించారని అన్నారు. ఈ అంశంపై తాను ట్రస్ట్ జనరల్ సెక్రెటరీ చంపత్ రాయ్‌ను ప్రశ్నించినట్లు చెప్పారు. దానికి చంపత్ రాయ్ సమాధానమిస్తూ.. ప్రతి కానుకను అందరికీ కనిపించేలా ఆలయంలో ప్రదర్శించలేమని చెప్పినట్లు లక్ష్మీనారాయణన్ అన్నారు. అయితే, ఈ కానుక విషయంలో ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ కానుక ఏమైందో తెలపాలని కోరుతున్నారు. ఇంతకుముందు కూడా దేవాలయానికి ఇచ్చిన వెండి కడ్డీలు, ఇటుకల విషయంలో కూడా వివాదం తలెత్తింది. ఆ కానుకలు ఏమయ్యాయో తేల్చాలని ప్రతిపక్షాలు కోరాయి. తాము సమర్పించిన 4 కేజీల వెండి ఇటుకను తాము సమర్పించాని శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాక్రే అన్నారు.
అలాంటి వాటి సంగతి తేల్చాలని ఆయన కోరారు. అయితే, ఆలయంలో 200 కేజీల వెండి మాయమైందనే వాదనను సిట్ కొట్టిపారేసింది. మరోవైపు రామాలయానికి భక్తులు సమర్పించిన బంగారు, వెండి కానుకలు, ఆభరణాల మాయం కావడంపై సిట్ విచారణ జరుపుతోంది. ఈ కేసులో పలువురిని సిట్ అరెస్టు చేసింది. మరోవైపు బద్రినాథ్ ఆలయంలో కూడా అక్రమాలు జరిగినట్లు తాజాగా వెల్లడైంది. దీనిపై విచారణకు ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది.