హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, పునరావాసానికి సంబంధించి పెండింగ్ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. భూసేకరణ కోసం రూ.5 వేల కోట్లను సమకూర్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని, అందులో రూ.2 వేల కోట్లు విడుదలయ్యాయని, మిగిలిన రూ.3వేల కోట్లను త్వరలో విడుదల చేయనున్నట్టు తెలిపారు.
కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల పరిధిలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సచివాలయంలో శనివారం సమీక్షించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మిడ్‌మానేరు ఎడమ కాలువ, పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో లక్ష్మీనరసింహస్వామి పత్తిపాక రిజర్వాయర్, జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని రోళ్లవాగు ప్రాజెక్టుల్లో పెండింగ్ పనులను పూర్తిచేయాలని తెలిపారు. ఈఎన్సీ రమేశ్‌బాబు, నీటిపారుదల శాఖ జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.