రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ).. అదరగొట్టింది. తమ చిరకాల కలను సాకారం చేసుకునేందుకు మరో అడుగు ముందుకేసింది. లీగ్ దశ జోరును కీలకమైన ప్లేఆఫ్స్‌లోనూ కొనసాగిస్తూ క్వాలిఫయర్-1లో పంజాబ్ కింగ్స్‌ను మట్టికరిపించింది. వార్ వన్‌సైడ్ అన్నట్లు ఏకపక్షంగా సాగిన పోరులో ఆర్సీబీ సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ ఘన విజయంతో ఫైనల్లోకి దూసుకెళ్లింది. సుయాశ్‌శర్మ స్పిన్ తంత్రానికి తోడు హాజిల్‌వుడ్ నిఖార్సైన పేస్‌తో పంజాబ్ పేకమేడను తలపిస్తూ 101 పరుగులకే కూప్పకూలింది. సొంత ఇలాఖాలో సత్తాచాటుదామనుకున్న పంజాబ్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. స్వల్ప లక్ష్యఛేదనలో ఫిల్ సాల్ట్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో 10 ఓవర్లలోనే ఘన విజయాన్ని ముద్దాడింది. ఈ క్రమంలో తొమ్మిదేండ్ల తర్వాత ఆర్సీబీ తుది పోరుకు అర్హత సాధించి ‘ఈ సాలా కప్ నమదే’ స్వప్నానికి సమీపంలో నిలిచింది.
RCB | ముల్లాన్‌పూర్: ఆర్సీబీ…ఐపీఎల్లో ఒక ఎమోషన్! ఈ సాలా కప్ నమదే అంటూ ప్రతీ సీజన్లో అభిమానుల భారీ అంచనాలు మోసే ఆర్సీబీ ఈసారి ఆ దిశగా ఒక్కో అడుగు ముందుకేస్తున్నది. లీగ్ దశలో ప్రత్యర్థులను పడగొడుతూ టాప్-2లో నిలిచిన ఆర్సీబీ అదే దూకుడుతో పంజాబ్ కింగ్స్‌ను చెడుగుడు ఆడుకుంది. గురువారం జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో(10 ఓవర్లు మిగిలుండగానే) పంజాబ్‌పై చిరస్మరణీయ విజయం సాధించింది. 2016 తర్వాత తొలిసారి తుదిపోరులో నిలిచిన ఆర్సీబీ..క్వాలిఫయర్-2 విజేతతో ఫైనల్లో తలపడుతుంది. తొలుత సుయాశ్ శర్మ (3/17), హాజిల్‌వుడ్ (3/21) ధాటికి పంజాబ్ 14.1 ఓవర్లలో 101 పరుగులకు కుప్పకూలింది.
ఆర్సీబీ బౌలింగ్ విజృంభణకు స్టొయినిస్(26) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. యశ్ దయాల్ (2/26) రెండు వికెట్లు తీశాడు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన బెంగళూరు 10 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్(27 బంతుల్లో 56 నాటౌట్, 6ఫోర్లు, 3సిక్స్‌లు) మెరుపు అర్ధసెంచరీతో జట్టు విజయంలో కీలకమయ్యాడు. కోహ్లీ(12), మయాంక్ అగర్వాల్(19), కెప్టెన్ రజత్ పాటిదార్(15 నాటౌట్) తలో చేయి వేశారు. తన స్పిన్ తంత్రంతో పంజాబ్ నడ్డివిరిచిన సుయాశ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
సుయాశ్ స్పిన్ ధమాకా : టాస్ గెలిచిన ఆర్సీబీ..పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. పిచ్ పరిస్థితులను సరిగ్గా అంచనా వేయని పంజాబ్ ఆదిలోనే మూల్యం చెల్లించుకుంది. ఈ సీజన్లో సూపర్ ఫామ్‌మీదున్న ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(7) వికెట్‌తో పంజాబ్ పతనానికి నాంది పడింది. యశ్ దయాల్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో కవర్స్‌లో షాట్ ఆడబోయిన ఆర్య..కృనాల్ పాండ్యా క్యాచ్‌తో తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఇక్కణ్నుంచి పంజాబ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. భువనేశ్వర్ మూడో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లతో దూకుడు మీద కనిపించిన ప్రభ్‌సిమ్రన్(18) అదే ఓవర్లో కీపర్ జితేశ్ క్యాచ్‌తో ఔటయ్యాడు. దీంతో పంజాబ్ 27 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది.
ఆ తర్వాత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(2)ను హాజిల్‌వుడ్ ఔట్ చేయడంతో పంజాబ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆదుకుంటాడనుకున్న ఇంగ్లిస్(4) కూడా ఔట్ కావడంతో పవర్‌ప్లే ముగిసే సరికి పంజాబ్ 48 పరుగులకే 4 వికెట్లు చేజార్చుకుంది. స్టొయినిస్ ఒక్కడే భారీ షాట్లు ఆడుతూ జోరు కనబర్చగా, మిగతా బ్యాటర్లు పెవిలియన్ వెళ్లేందుకు పోటీపడ్డారు. బౌలింగ్ మార్పుగా వచ్చిన స్పిన్నర్ సుయాశ్ ఒకే ఓవర్లో శశాంక్సింగ్(3), ముషిర్ఖాన్(0)ను ఔట్ చేసి పంజాబ్‌ను ఘోరంగా దెబ్బకొట్టాడు. ఓ ఎండ్‌లో స్టొయినిస్‌కు సహకరించే వారు కరువయ్యారు. అయితే సుయాశ్ బంతిని సరిగ్గా అర్థం చేసుకోని స్టొయినిస్ ఔట్ కావడంతో పంజాబ్ ఇన్నింగ్స్‌కు ఫుల్స్టాప్ పడింది.
సాల్ట్ మెరుపుల్ : స్వల్ప లక్ష్యఛేదనలో ఆర్సీబీ అదరగొట్టింది. మంచి ఫామ్‌మీదున్న సాల్ట్..బౌలర్ ఎవరన్నది లెక్కచేయకుండా బ్యాటు ఝులిపించాడు. జెమీసన్ బౌలింగ్‌లో కోహ్లీ ఔటైనా సాల్ట్ తన జోరు తగ్గించలేదు. ఈ క్రమంలో బౌండరీలతో చెలరేగిన సాల్ట్ 23 బంతుల్లోనే అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు. ఐపీఎల్లో సాల్ట్‌కు ఇది వేగవంతమైన అర్ధసెంచరీ. మయాంక్(19) ఉన్నంతసేపు సాల్ట్‌కు సహకరించాడు. మయాంక్ ఔట్ తర్వాత వచ్చిన పాటిదార్..ముషిర్ బౌలింగ్‌లో సిక్స్‌తో గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు.
పంజాబ్: 14.1 ఓవర్లలో 101 ఆలౌట్(స్టొయినిస్ 26, ప్రభ్‌సిమ్రన్ 18, సుయాశ్ 3/17, హాజిల్‌వుడ్ 3/21),
బెంగళూరు: 10 ఓవర్లలో 106/2(సాల్ట్ 56 నాటౌట్, మయాంక్ 19, జెమీసన్ 1/27, ముషిర్ 1/27)