వినాయక్‌నగర్, జూలై 4 : జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు వందల సంఖ్యలో నమోదువుతున్నాయి. నిత్యం పోలీసులు చేపడుతున్న తనిఖీల్లో వాహనదారులు పట్టుబడుతున్నారు. కొందరు జరిమానాలు చెల్లిస్తుండగా, మరికొందరు జైలు శిక్షలు అనుభవిస్తున్నారు. అయినా మందుబాబుల్లో ఇసుమంతైనా మార్పు రావడంలేదు. జిల్లాలో తరచూ చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు సీపీ సాయిచైతన్య అవసరమైన కట్టుదిట్టమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఎక్కువ శాతం జరిగే రోడ్డు ప్రమాదాల్లో మద్యం తాగి వాహనాలు నడపడమే కారణమని గుర్తించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ప్రతిరోజూ చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు పోలీసులు నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నారు. ఒకపక్క పోలీసులు పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ, మరోవైపు మందుబాబులు ఇవేమీ తమకు పట్టునట్లుగా వ్యవహరిస్తూ తనిఖీల్లో పట్టుబడుతున్నారు. యథేచ్ఛగా మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారు. వందల సంఖ్యలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో వాహనదారులు పట్టుబడుతున్నారు. వారిపై సంబంధిత పోలీసులు కేసులు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నారు. కోర్టు వారికి భారీగా జరిమానాలు విధించడంతోపాటు జైలుశిక్ష సైతం విధిస్తున్నది. అయినా మందుబాబులు తమ తీరును మార్చుకోవడంలేదు. నిత్యం తనిఖీలు కొనసాగుతుండగా, మరోవైపు వాహనదారులు మద్యం తాగి వాహనాలను నడుపుతునే ఉన్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి గతంలో రూ. వెయ్యి విధించేవారు. ప్రస్తుతం కొత్త అమెండ్మెంట్ యాక్ట్ అమలులోకి రావడంతో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనదారులకు రూ.10 వేల వరకు జరిమానా విధిస్తున్నారు. అంతేగాక వారం రోజుల పాటు జైలుశిక్ష సైతం విధిస్తారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిలో మార్పు తెచ్చేందుకు ఇటు పోలీసులు, అటు కోర్టు కఠినంగా వ్యవహరించినప్పటికీ, చాలామంది వాహనదారుల్లో మార్పు మాత్రం రాకపోవడం గమనార్హం. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యం చేరాలన్నది పోలీసు శాఖ నిత్యం చేస్తున్న ప్రయత్నమని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్అలీ పేర్కొన్నారు.