లండన్: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్.. టెస్టు కెప్టెన్సీకి వీడ్కోలు పలికాడు. వ్యక్తిగత ప్రదర్శన అద్భుతంగా ఉన్నా.. జట్టు నిలకడగా విఫలమవుతుండటంతో రూట్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్‌కు పెట్టింది పేరైన ఇంగ్లండ్ జట్టు.. గత 17 టెస్టుల్లో ఒక్క దాంట్లో మాత్రమే విజయం సాధించింది. ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్‌ను 0-4తో కోల్పోయిన ఇంగ్లిష్ జట్టు.. ఇటీవల విండీస్ చేతిలోనూ ఓటమి పాలైంది. ‘దేశానికి సారథ్యం వహించడాన్ని ఎంతగానో ప్రేమించా. కెప్టెన్సీకి వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నా. ఇది ఎంత కఠినమైందో నాకు బాగా తెలుసు. సన్నిహితులతో చర్చించాక ఆటపై మరింత శ్రద్ధ పెట్టేందుకే కెప్టెన్సీకి దూరమవుతున్నా’ అని 31 ఏండ్ల రూట్ శుక్రవారం పేర్కొన్నాడు. 2017లో అలిస్టర్ కుక్ నుంచి పగ్గాలు అందుకున్న రూట్.. ఐదేండ్ల పాటు జట్టును ముందుకు నడిపించాడు.