ఇటీవల జరిగిన బోనాల వేడుకలో కథానాయిక ఫరియా అబ్దుల్లా సందడి చేసింది. అమ్మవారికి బంగారు బోనం సమర్పించడంతో పాటు పోతరాజుతో కలిసి ఆమె హుషారుగా నృత్యాలు చేసింది. ఈ వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. మత విశ్వాసం వేరైనా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై ఆమెకున్న గౌరవం పట్ల సోషల్‌మీడియా వేదికగా ప్రశంసలు వెల్లువెత్తాయి. అదే సమయంలో కొందరు ఉద్దేశ్యపూర్వకంగా విమర్శలు చేస్తూ ట్రోలింగ్‌కు దిగారు. ఈ పరిణామాలపై స్పందిస్తూ శనివారం ఫరియాఅబ్దుల్లా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది.
తన తండ్రి సంజయ్ అబ్దుల్లా జన్మతః హిందువని, తర్వాత ఆయన ఇస్లాంలోకి మారారని చెప్పింది. ‘నేను మతంలో ఎప్పుడూ మంచి విషయాలనే చూశాను. నన్ను ద్వేషించేవారు, నాకు మతవిశ్వాసాలు లేవని భావించేవారు ఏమనుకున్నా సరే..వారందరికి మంచి జరగాలని కోరుకుంటున్నా. నన్ను ఎంత ద్వేషించినా సరే మీకు అంత ప్రేమను పంచుతూనే ఉంటా. నేను చెట్లలో, రాళ్లలో, ప్రతీ జీవిలో దైవత్వాన్ని చూస్తాను. ఇవన్నీ మిమ్మల్ని దేవుడి ప్రేమకు దగ్గర చేయడానికి బదులు దూరం చేస్తున్నట్లయితే మీరు గొప్ప అనుభూతిని కోల్పోతున్నారని చెప్పడానికి బాధపడుతున్నా’ అంటూ వీడియోలో భావోద్వేగాన్ని ఆపుకోలేక కన్నీటిపర్యంతమయింది ఫరియా అబ్దుల్లా.