శ్రీలంకతో టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ దిగ్గజం వసీం జాఫర్ ప్రశంసల వర్షం కురిపించాడు. అక్కడితో ఆగకుండా మరొక అడుగు ముందుకేసి టెస్టుల్లో కోహ్లీ కన్నా విజయవంతమైన కెప్టెన్ అవుతాడంటూ రోహిత్‌కు కితాబిచ్చాడు. కోహ్లీకి సరైన వారసుడు రోహితేనని జాఫర్ అభిప్రాయపడ్డాడు.
‘‘కోహ్లీ కన్నా రోహిత్ బెటర్ టెస్టు కెప్టెన్ అవుతాడు. అయితే ఎన్ని టెస్టులకు కెప్టెన్‌గా ఉంటాడనేది ప్రశ్న. నా వరకు వ్యూహాల ప్రకారం అతను అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడు. వరుస వైట్‌వాష్‌లతో అతని వ్యూహాల ఫలితాలు కనిపిస్తూనే ఉన్నాయి. సరైన వ్యక్తి చేతుల్లోకి కెప్టెన్సీ వచ్చినట్లు అనిపిస్తోంది’’ అని ఈ మాజీ ప్లేయర్ చెప్పాడు.
అలాగే సౌతాఫ్రికా చేతిలో ఓటమి వల్ల వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ చేరడంపై నీలి నీడలు కమ్ముకున్నప్పటికీ.. ఇంకా భారత్ ఆశలు సజీవంగానే ఉన్నాయని జాఫర్ అన్నాడు. భారత్‌కు మరీ ఎక్కువగా టెస్టు సిరీసులు లేవని, కాబట్టి కావలసినంత విశ్రాంతి దొరుకుతుందని చెప్పిన ఈ మాజీ ఆటగాడు..
‘‘ఇంగ్లండ్‌లో ఒక టెస్టు, ఆ తర్వాత మళ్లీ బంగ్లాదేశ్‌లో ఆడాలి. అంటే చాలా బ్రేక్స్ దొరుకుతాయి. అయితే ఆస్ట్రేలియా ఇక్కడకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆడితే టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు చేరడం సమస్య కాదని నా అభిప్రాయం’’ అని వివరించాడు. కాగా, గతేడాది ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లినప్పుడు భారత శిబిరంలో కరోనా కారణంగా ఐదో టెస్టు ఆడకుండానే టీమిండియా వెనక్కు వచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆ టెస్టును భారత్ ఆడనుంది.