– పరిమితికి మించి ప్రయాణికుల రవాణా ప్రమాదం
– గూడ్స్ వాహనాల్లో ప్రజా రవాణా చేయవద్దు.
– ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కవద్దు
– గూడ్స్, ప్యాసింజర్ వాహనదారులు నియమ నిబంధనలు పాటించాలి.
– నిబంధనలు అతిక్రమించిన వాహనాలపై వారం రోజుల్లో 70 కేసులు నమోదు
సూర్యాపేట టౌన్, నవంబర్ 10 : రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ అన్నారు. సోమవారం ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిత్యం వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోడ్డు భద్రత నియమ నిబంధనలు, ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి హెచ్చరించడంతో పాటు అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలను, కూలీలను, చిన్న పిల్లలను గూడ్స్ వాహనాల్లో రవాణా చేసినా, పరిమితికి మించి ప్యాసింజర్ వాహనాల్లో రవాణా చేసిన అలాంటి వాహనాలను గుర్తించి కేసులు నమోదు చేస్తున్నామన్నారు. గత వారం రోజుల్లో జిల్లాలో పరిమితికి మించి, గూడ్స్ వాహనాల్లో కూలీలను, ప్రజలను తరలిస్తున్న 70 వాహనాలను గుర్తించి జరిమానాలు విధించి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
పలుమార్లు నిబంధనలు అతిక్రమించి కేసులు నమోదు అయిన వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. అలాగే రోడ్డు ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండి ప్రజలు తమ ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని ప్రయాణించాలని సూచించారు. రవాణా చట్ట ప్రకారం గూడ్స్ వాహనాలు కేవలం సరుకుల రవాణా కోసమే ఉపయోగించాలన్నారు. వాటిలో వ్యక్తులను, కూలీలను, చిన్నపిల్లలను రవాణా చేయడం నేరమన్నారు. గూడ్స్ వాహనాల్లో ప్రయాణించడం వల్ల తీవ్ర రోడ్డు ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ, సురక్షిత రవాణా కోసం పరిమితికి లోబడి వాహనాల్లో ప్రయాణించాలని పేర్కొన్నారు.