హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు, ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు ప్రతి పౌరుడూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని డీజీపీ శివధ్రెడ్డి పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రాష్ట్ర పోలీస్‌శాఖ చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ రోడ్డు సేఫ్టీ ప్రచార కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం భాగస్వాములయ్యారని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం యూసుఫ్‌గూడలోని ఇండోర్ స్టేడియంలో జరిగే అవగాహన కార్యక్రమానికి సీఎం హాజరుకానున్నట్టు తెలిపారు. ఈ ప్రచారం ఈ నెల 13 నుంచి 24 వరకు పండుగ సెలవులు మినహా పది రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
ప్రజలు, విద్యార్థులు, యువత, సెలబ్రిటీలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్లు, మీడియా, ప్రజాప్రతినిధులు, అన్ని ప్రభుత్వ శాఖలు, న్యాయవ్యవస్థల భాగస్వామ్యంతో ఆదర్శ రోడ్డు భద్రతా రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టంచేశారు. ఇక నుంచి హెల్మెట్ ధరించకపోవడం, సీటుబెల్ట్ వినియోగం లేకపోవడం, వాహనం నడుపుతూ మొబైల్ వినియోగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, రాంగ్‌సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, స్టాప్‌లైన్ దాటడం, హైవేలపై ఆటోల ఓవర్ లోడింగ్, మీటర్-యూనిఫాం నిబంధనలు ఉల్లంఘించడం, హైబీమ్ లైట్లు, ఎడమవైపు నుంచి ఓవర్ టేకింగ్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నట్టు డీజీపీ తెలిపారు.
హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఈబీసీ కమిషన్‌ను ఈబీసీ జాతీయ అధ్యక్షుడు వల్లపురెడ్డి రవీందర్‌రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈబీసీల అభ్యున్నతికి ప్రత్యేక మంత్రిత్వ శాఖతోపాటు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అగ్రవర్ణ నిరుపేదలకూ వర్తింపజేయాలని కోరారు. అగ్రవర్ణాల్లో 90% మంది నిరుపేదలు ఉన్నారని, వీరి కోసం గురుకులాలు, స్టడీ సర్కిళ్లు నెలకొల్పడంతోపాటు ఉద్యోగ నియామకాల్లో వయో పరిమితిని సడలించాలని రవీందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.