హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): సినీ నిర్మాతల కోసం టికెట్ ధరలు పెంచి.. ప్రజల మీద భారం వేయకూడదని సీపీఐ జాతీయ నేత డాక్టర్ కే నారాయణ సూచించారు. ధరలు పెంచుకునేందుకు సినీ పెద్దలు అడిగిన వెంటనే ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వందల కోట్లు ఖర్చు చేసి సినిమాలు నిర్మించార ని ప్రజలను దోచుకుంటారా అని ప్రశ్నించారు. వందల కోట్లు పెట్టి సినిమాలు ఎవరు తీయమని చెప్పారని ధ్వజమెత్తారు. సినిమా హాళ్లల్లో ఏది కొనాలంటే వందల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉన్నదని తెలిపారు. చాలామంది వ్యాపారాలు చేస్తున్నారని, మరి వాళ్లందరికి నష్టాలు వస్తే ప్రభుత్వం భరిస్తుందా అని ప్రశ్నించారు. కొత్త సినిమాల విడుదలకు ముందు బెనిఫిట్ షోలతోపాటు పదిరోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వాలు ఎందుకు అనుమతిస్తున్నాయని నిలదీశారు. అధిక ధరలకు అడ్డుకట్ట వేయాల్సిన ప్రభుత్వాలే అనుమతులివ్వడం శోచనీయమని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఇలాంటి వాటిని ప్రోత్సహించవద్దని నారాయణ సూచించారు.