‘ప్రతి యుగంలో దీనుల్ని కాపాడేందుకు ఒక ఆయుధం పుడుతుంది. త్రేతాయుగంలో రామబాణం, ద్వాపరంలో సుదర్శనం, కలియుగంలో ‘ది 100’. ఇది రాసిపెట్టుకోండి. ఈ సినిమాకు అంత పవర్ ఉంది. ఇదో ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా.’ అని హీరో ఆర్కే సాగర్ అన్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ‘ది 100’. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకుడు. రమేష్ కరుటూరి, వెంకీ పుషడపు నిర్మాతలు. ఈ నెల 11న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్‌బాబు, సీనియర్ దర్శకులు ఏ.కోదండరామిరెడ్డి, బి.గోపాల్ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు.
ఇంకా సాగర్ మాట్లాడుతూ ‘అంజనమ్మ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, నాగబాబు, సజ్జనార్ ఇలా పలువురు పెద్దలు ఈ సినిమాను ఆశీర్వదించారు. పవన్‌కల్యాణ్‌గారు ట్రైలర్ లాంచ్ చేయడంతో సినిమాపై హైప్ మొదలైంది. వారందరికీ ధన్యవాదాలు. శశిధర్ పాషన్ ఉన్న దర్శకుడు. ఈ సినిమాతో ఆయన గొప్ప స్థాయికి వెళతాడు. హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతం సినిమాకు ఎస్సెట్. ఈ సినిమాకు పనిచేసిన వారంతా ప్రాణం పెట్టారు.’ అని తెలిపారు. ‘ఓ అద్భుతమైన స్క్రిప్ట్ ఇది. ఈ కథను గ్రిప్పింగ్‌గా ఎక్సైటింగ్‌గా, ఎంగేజింగ్‌గా చెప్పాం. ఇప్పటికే పలు ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఈ సినిమాకు అవార్డులు వచ్చాయి. కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా ఇది.’ అని దర్శకుడు చెప్పారు. ఇంకా కథానాయికలు మిశా, ధన్య బాలకృష్ణ తదితరులు కూడా మాట్లాడారు.