గద్వాల, ఆగస్టు 8 : ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తుండటంతో ఆరుతడి పంటలు సాగు చేయాలని జోగుళాంబ గద్వాల కలెక్టర్ రిజ్వాన్భాషా షేక్ రైతులకు సూచించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జూరాలకు ఎగువన నుంచి వరద వస్తున్నా తాగునీటి అవసరాల దృష్ట్యా జలాలను జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువులు నింపుకొనేందుకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.
జూరాల కుడి కాల్వ ద్వారా నీటిని విడుదల చేసినా వరద తగ్గుముఖం పడితే నీటి సరఫరా నిలిపివేస్తారని తెలిపారు. సీజన్ మొత్తం కాల్వల ద్వారా నీటి విడుదల చేసే విషయంపై స్పష్టత లేదన్నారు. ఈ నెల 7న హైదరాబాద్ నుంచి మంత్రులు, అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లా కలెక్టర్లతో మాట్లాడుతూ వానకాలం లో వరికి బదులుగా ఆరుతడి పంటలు వేయాలని సూచించినట్టు చెప్పారు.