Rishiteshwari | తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రిషితేశ్వరి ఆత్మహత్య కేసును గుంటూరు కోర్టు కొట్టేసింది. సరైన సాక్ష్యాధారాలు లేనందున ఈ నిర్ణయం తీసుకుంటున్నామని తుది తీర్పు వెలువరించింది.
రిషితేశ్వరి స్వస్థలం తెలంగాణలోని వరంగల్. నాగార్జున యూనివర్సిటీలోని ఆర్కిటెక్చర్ కోర్సులో చేరింది. అయితే 2015 జూలై 14వ తేదీన రిషితేశ్వరి అనుమానాస్పదంగా మృతి చెందిన కనిపించింది. ఆమె మృతదేహం దగ్గర ఓ సూసైడ్ నోట్ కూడా దొరికింది. ర్యాగింగ్ కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా సూసైడ్ నోట్లో కూడా పేర్కొంది. సీనియర్ విద్యార్థుల వేధింపులు తట్టుకోలేకపోతున్నానని ఆ లేఖలో తెలిపింది. దీంతో ఈ ఉదంతం అప్పట్లో సంచలనంగా మారింది. గుంటూరు కోర్టులో తొమ్మిదేళ్ల పాటు ఈ కేసుపై విచారణ జరిగింది. చివరకు ప్రాసిక్యూషన్ నేరం నిరూపించలేకపోవడంతో న్యాయస్థానం ఈ కేసును కొట్టివేసింది.
రిషితేశ్వరి కేసులో అప్పీల్‌కు వెళ్లాలని నిర్ణయించినట్లు పీపీ వైకే తెలిపారు. ఆత్మహత్యకు ప్రేరేపించిన వారి పేర్లు డైరీలో ఉన్నాయని పేర్కొన్నారు. తనను ఏ విధంగా వేధించారో ఆ డైరీలో ఉందన్నారు. సీనియర్లు ఎలా వేధించారో డైరీలో స్పష్టంగా రాసి ఉందని చెప్పారు. ఫిర్యాదు చేసినా ప్రిన్సిపాల్ బాబురావు పట్టించుకోలేదన్నారు. ఫ్రెషర్స్ పార్టీలో లైంగికంగా వేధించారని చెప్పారు. గుంటూరు కోర్టు ఇచ్చిన తీర్పు న్యాయమైనది కాదని భావిస్తున్నామన్నారు.
గుంటూరు తీర్పుపై రిషితేశ్వరి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొమ్మిదేళ్లుగా పోరాడుతున్నామని.. ఇక ఓపిక లేదని రిషితేశ్వరి తల్లి తెలిపారు. న్యాయం జరుగుతుందని భావించామన్నారు. డైరీని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో తెలియడం లేదని చెప్పారు. డైరీలో అన్ని వివరాలు ఉన్నాయన్నారు. ఈ కేసులో 170 మంది సాక్ష్యులు ఉన్నారని.. తమ కూతురు రాసిన లేఖ కూడా ఉందని.. వాటిని ఈ కేసులో ఎందుకు సాక్ష్యాలుగా పరిగణించలేదో అర్థం అవ్వడం లేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయంపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలుస్తామని తెలిపారు. కోర్టులకు వెళ్లే ఆర్థిక స్తోమత తమకు లేదని.. ప్రభుత్వమే తమకు సాయం అందించాలని కోరారు.
Rishiteswari1