Bollywood | బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత రియా చక్రవర్తి కుటుంబం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ముంబయిలోని బాంద్రాలో 2020 జూన్ 14న సుశాంత్ సింగ్ తన ఫ్లాట్‌లో అనుమానాస్పద రీతిలో మరణించారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, అది ఆత్మహత్య కాదంటూ ఆయన కుటుంబసభ్యులు నటి రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులపై కేసు పెట్టారు. నిందితులు సుశాంత్ బ్యాంకు ఖాతా నుంచి రూ.15 కోట్లు బదిలీ చేసుకున్నారని, అతని తండ్రి కేకే సింగ్ ఆరోపించడతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రియాను ప్రశ్నించింది. నటుడి మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి జైలుకు కూడా వెళ్లారు.
దాదాపు నాలుగేళ్లపాటు విచారణ కొనసాగింది. సుశాంత్‌ను ఎవరైనా ఆత్మహత్యకు ప్రేరేపించారా? అనే విషయంలో ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో రియా చక్రవర్తి, ఆమె కుటుంబానికి క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత తనతోపాటు తన తమ్ముడి కెరీర్లు ముగిశాయని నటి రియా చక్రవర్తి తెలిపారు. ‘సుశాంత్ చనిపోయాక నాకు నటనపరంగా అవకాశాలు రాలేదు. నా తమ్ముడు షోయిక్ క్యాట్ పరీక్షలో 96 పర్సంటేజ్ పొందినా.. అరెస్ట్ అవ్వడంతో ఎంబీఏలో చేరలేకపోయాడు. కొన్ని రోజులు మా జీవితాలు ఎటు వెళ్తున్నాయో అర్ధం కాని పరిస్థితి. చివరకు ఈ కేసులో క్లీన్ చిట్ రావడంతో ఊపిరి పీల్చుకున్నాం అని తాజాగా రియా చెప్పుకొచ్చింది.
రియా చక్రవర్తి.. 2009లో ఎమ్‌టీవీ ఇండియా షో “TVS స్కూటీ టీన్ దివా”లో పాల్గొని రన్నరప్‌గా నిలిచిన రియా చక్రవర్తి ఎమ్‌టీవీ డిల్లీలో వీజేగా ఎంపికై, “పెప్సీ ఎమ్‌టీవీ వాసప్”, “టిక్‌టాక్ కాలేజ్ బీట్”, “ఎమ్‌టీవీ గాన్ ఇన్ 60 సెకండ్స్” వంటి షోలను హోస్ట్ చేసింది. హీరోయిన్ గా ఈ అమ్మడు తెలుగులో 2012లో తూనీగ తూనీగ అనే సినిమా చేసింది. ఇందులో నిధి పాత్రతో ఆకట్టుకుంది. 2013లో హిందీ చిత్రం మేరె డాడ్ కి మారుతితో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత “సోనాలీ కేబుల్”, “బ్యాంక్ చోర్”, “హాఫ్ గర్ల్‌ఫ్రెండ్”, “జలేబీ” సినిమాల్లో నటించింది. 2020లో బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత రియా వివాదంలో చిక్కుకుంది. అయితే తనకి క్లీన్ చీట్ రావడంతో పలు షోస్, సోషల్ మీడియాతో తన అభిమానులని అలరిస్తుంది.