న్యూఢిల్లీ, జూన్ 25: ఓటరు జాబితాలో అర్హులైన భారతీయ పౌరులు మాత్రమే పేరు నమోదు చేసుకునేలా దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలను సమగ్రంగా సమీక్షించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇందుకోసం ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (ఎస్ఐఆర్)ను చేపడుతున్నట్టు ఈసీ బుధవారం ప్రకటించింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులు ఇంటింటి సర్వే నిర్వహిస్తారని, ఓటర్ల పుట్టిన ప్రదేశాన్ని చెక్ చేస్తారని ఈసీ తెలిపింది. ఈసీ చివరిసారి నిర్వహించిన 2003 ఎస్ఐఆర్లో లేనివారు, ముఖ్యంగా 1987 జూలై 1కి ముందు జన్మించిన వ్యక్తులు.. పుట్టిన స్థలం, పుట్టిన తేదీకి రుజువు పత్రాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని ఈసీ తెలిపింది.
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్‌తో ఎస్ఐఆర్ మొదలవుతుందని, అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాల్లో చేపడుతున్నామని ఈసీ వెల్లడించింది. ఆ తర్వాత ఇతర రాష్ర్టాల్లోనూ దీనిని నిర్వహిస్తామని పేర్కొన్నది. ఓటర్ జాబితా కచ్చితత్వంపై గత కొన్నేండ్లుగా అనుమానాలు, అందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంట్లో అక్రమ వలసదారులకు చోటు దక్కిందన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ‘ఎస్ఐఆర్’ నిర్వహించబోతున్నట్టు ఈసీ పేర్కొన్నది.