సూర్యాపేట, మార్చి 15 : వేసవిలో జిల్లాలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా
అవసరమైన చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ అధికారులను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అదేశించారు. ఎండకాలం నేపథ్యంలో తాగునీటి సరఫరాపై బుధవారం సూర్యాపేట కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ఎస్.వెంకట్రావ్‌తో కలిసి మిషన్ భగీరథ, మున్సిపల్, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ అధికారులు, ఎంపీడీఓలతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న వేసవిలో జిల్లావ్యాప్తంగా ప్రతి ఇంటికీ తప్పనిసరిగా నల్లా కలెక్షన్ అందించాలన్నారు. గ్రామాల్లో అక్కడక్కడా పెండింగ్‌లో ఉన్న ఇంట్రా పైప్‌లైన్ పనులను త్వరతగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీల్లో తాగునీటి సరఫరాకు నిర్ధిష్ట సమయం కేటాయించాలని సూచించారు. ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే మున్సిపల్, మిషన్ భగీరథ అధికారులు స్పందించి నీటి సరఫరాను పునరుద్ధరించాలని సూచించారు. మిషన్ భగీరథ తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వేసవిలో నీటి సరఫరా విషయంలో సాకులు చెప్పవద్దన్నారు.
జిల్లాలోని 475గ్రామ పంచాయతీల్లో పెండింగ్ సమస్యలను నెల రోజుల లోపు పరిష్కరించాలని ఆదేశించారు. రహదారుల నిర్మాణ సమయంలో పంచాయతీ రాజ్, ఆర్ అండ్‌బీ నేషనల్ హైవే అధికారులతో కలిసి మిషన్ భగీరథ అధికారులు జాయింట్ సర్వే చేసిన తర్వాతే పనులు మొదలు పెట్టాలన్నారు. అనంతగిరి మండలం కొత్తగూడెం గ్రామంలో రోడ్డు నిర్మాణ సమయంలో పైప్‌లైన్ పగిలి నీటి సరఫరా ఆగిపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రామాల్లోకి వెళ్లి నీటి సరఫరా చేయకపోవడానికి గల కారణాలపై నివేదిక అందించాలని అదేశించారు. దాదాపు 5గంటల పాటు సాగిన సమావేశంలో మండలాల వారీగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు పాటిల్ హేమంత్ కేశవ్, ఎస్.మోహన్‌రావు, మిషన్ భగీరథ సీఈ సురేశ్, ఎస్ఈ చెన్నారెడ్డి, ఆర్డీఓలు రాజేంద్రకుమార్, కిశోర్‌కుమార్, వెంకారెడ్డి, జడ్పీ సీఈఓ సురేశ్, డీపీఓ యాదయ్యతో పాటు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.