– పరాకాష్టకు రేవంత్ పైశాచిక పాలన
– ఫామ్ హౌస్ పై దాడికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎస్కార్ట్
– కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ, సెప్టెంబర్ 09 : ప్రజా సమస్యలపై ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీలో నిలదీస్తున్న తమ పార్టీ ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పలేక పలాయనవాదంతో దాడులు, అరెస్టులు చేయిస్తూ ప్రజాస్వామ్య గొంతు నొక్కుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైశాచిక పాలన నుండి ప్రజలను రక్షించేందుకు గవర్నర్ జోక్యం చేసుకుని ఆయనను బర్తరఫ్ చేయాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. బుధవారం కోదాడలోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహనీయుడు కేసీఆర్ చావును కోరుకునే స్థాయికి రేవంత్ రెడ్డి దిగజారాడని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల తొలిరోజే తమ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మిలపై దుశ్శాసన పర్వాన్ని గుర్తుకు తెచ్చేలా దాడి జరిగినప్పటికీ కనీసం విచారం వ్యక్తం చేయని కలియుగ దుశ్శాసనుడు రేవంత్ రెడ్డి అని విమర్శించారు.
అసెంబ్లీ రెండో రోజున, ముఖ్యమంత్రే స్వయంగా కాంగ్రెస్ సభ్యులను రెచ్చగొట్టి, తెలంగాణ జాతిపిత కేసీఆర్ ఫామ్ హౌస్ పైకి ఉసిగొల్పి అధికార పార్టీ ఎమ్మెల్యేలకు పోలీసు ఎస్కార్ట్ ఇచ్చి మరీ దాడులకు పంపించడం రాష్ట్రంలో నెలకొన్న దౌర్భాగ్య పరిస్థితికి, శాంతి భద్రతలకు అర్థం పడుతుందన్నారు. మూడో రోజున ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్ష సభ్యులు నిలదీస్తుంటే, సమాధానం చెప్పలేక మూకుమ్మడిగా సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమన్నారు. చివరకు సభకు హాజరు కాని ఎమ్మెల్యేలు కేటీఆర్, మల్లారెడ్డిను సస్పెండ్ చేయడం వారి, నియంతృత్వ పోకడలకు నిదర్శనం అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన కనుమరుగై హిట్లర్ పాలన కొనసాగుతుందన్నారు. మహబూబాబాద్‌లో ధర్నా చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థి గొంతును పోలీస్ ఇన్స్పెక్టర్ నొక్కిన ఘటన మరొక ముందే మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల అసభ్య దాడి రేవంత్ రెడ్డి ప్రభుత్వ అరాచక పాలనకు సాక్షి భూతం అన్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఉద్యోగులకు జీతాలు, రైతుల నెత్తిన భారం మోపేలా తీసుకొచ్చిన 22A జీవోపై, కరెంటు, సాగునీటి సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరగకుండా ఉండేందుకే బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేశారన్నారు.
హింసను ప్రేరేపిస్తూ, దాడులను ప్రోత్సహిస్తూ హోంమంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని, ఆయన ఆ పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ అరాచక పాలనను, అణచివేతను వివరిస్తూ ఇప్పటికే బీఆర్ఎస్ సభ్యులు గవర్నర్ కలిసి ఫిర్యాదు చేశారన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ, హింసాత్మక ఘటనలకు ఊతం ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తక్షణమే గవర్నర్ భర్తరఫ్ చేయాలని, మహిళా ఎమ్మెల్యేల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బొల్లం మల్లయ్యయాదవ్ డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి దాడులు పునరావృతమైతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు వారం రోజులపాటు నిర్వహించిన కార్యక్రమాలను విజయవంతం చేసినందుకు పార్టీ శ్రేణులకు, ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎస్.కె నయీమ్, ఉపేందర్ గౌడ్, భాగ్యమ్మ, ఇమ్రాన్, అబ్బో పాల్గొన్నారు.