YS Jagan : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి సుదీర్ఘ పాదయాత్రకు సిద్ధమయ్యారు. 2029 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా తాను చేపట్టబోయే రెండో విడత పాదయాత్రకు ముహూర్తం ఖరారు చేశారు. 2027 సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో తన పాదయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. నేడు బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ వైసీపీ కార్యకర్తల సమావేశంలో జగన్ ఈ కీలక ప్రకటన చేశారు.
గతంలో కూడా అధికారం కోసం జగన్ ఇదే ఫార్ములాను అనుసరించారు. 2017 నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయలో ‘ప్రజా సంకల్ప యాత్ర’ పేరుతో ఆయన తన తొలి పాదయాత్రను ప్రారంభించారు. ఆ యాత్ర 341 రోజులపాటు ఏకధాటిగా సాగి, 3,648 కిలోమీటర్ల దూరం కొనసాగింది. 2019 జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో యాత్ర ముగిసింది. ఈ యాత్రలో భాగంగానే ఆయన ‘నవరత్నాలు’ పథకాలను ప్రకటించారు.
ప్రజల నుంచి వచ్చిన అపూర్వ స్పందన, యాత్రలో తెలుసుకున్న సమస్యల ఆధారంగా రూపొందించిన ఈ హామీలు 2019 ఎన్నికల్లో వైసీపీకి చారిత్రాత్మక విజయాన్ని అందించాయి. మళ్లీ అదే సెంటిమెంట్‌తో 2029 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా జగన్ ఈ రెండో పాదయాత్రకు సిద్ధమయ్యారు. 2027లో యాత్ర ప్రారంభించి, ఎన్నికల వరకు దాదాపు రెండేళ్లపాటు ప్రజల మధ్యే ఉండాలని ఆయన భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ యాత్ర ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడంతోపాటు ప్రస్తుత కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని జగన్ వ్యూహరచన చేస్తున్నారు. త్వరలోనే ఈ పాదయాత్రకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, రూట్ మ్యాప్‌పై స్పష్టత రానుంది. మొత్తం మీద 2029 ఎన్నికల సమరానికి జగన్ ఇప్పటినుంచే ‘పాదయాత్ర 2.O’ తో సిద్ధమవుతున్న సంకేతాలు పంపారు.