Premane Oorilo | కన్నడ నాట సంచలన విజయం సాధించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ప్రేమనే ఊరిలో’ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను మైమరిపించడానికి సిద్ధమైంది. మహారత్న ప్రొడక్షన్స్, ఎస్కే పిక్చర్స్ మరియు వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై ప్రముఖ నిర్మాతలు చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మనోజ్ కుమార్ అత్యంత ఆసక్తికరమైన కథ, కథనాలతో ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీపై ఇండస్ట్రీలో మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటికే సెప్టెంబర్ 25న కన్నడలో విడుదలైన ఈ చిత్రం అక్కడ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా, థియేటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. కన్నడ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రాన్ని గాంధీ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. భారతీయ సినీ రంగాన్ని షేక్ చేసిన ‘కేజీఎఫ్’, ‘కాంతార’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు డైలాగ్స్ అందించిన హనుమాన్ చౌదరి ఈ సినిమాకు బలమైన సంభాషణలు రాయడం విశేషం.
ప్రముఖ గేయ రచయిత రాంబాబు గోసాల రాసిన అద్భుతమైన పాటలకు సునద్ గౌతమ్ అందించిన స్వరాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇప్పటికే మార్కెట్లోకి విడుదలైన ఈ చిత్రంలోని పాటలు, టీజర్ మరియు ట్రైలర్‌కు సోషల్ మీడియాలో విశేషమైన స్పందన లభించింది. విజువల్స్ పరంగా సినిమాను అత్యంత సుందరంగా మలిచిన రాజ్‌కాంత్ ఎస్.కె సినిమాటోగ్రఫీ, హర్షిత్ ప్రభు ఎడిటింగ్ వర్క్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. కర్ణాటకలో సాధించిన ఘనవిజయం తరహాలోనే తెలుగు ప్రేక్షకులు కూడా ఈ ప్రేమకథా చిత్రాన్ని ఆదరిస్తారని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.