CM Revanth Reddy | హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి సొంత పార్టీ సీనియర్ నేతపైనే విమర్శలు గుప్పించారు. వ్యక్తిగత మైలేజీ కోసం సీనియర్‌నేతను అభాసుపాలు చేశారని హస్తం నేతలు మండిపడుతున్నారు. కంటోన్మెంట్లో గురువారం నిర్వహించిన డిజిటల్ ఫ్యామిలీ కార్డుల పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మూసీ కూల్చివేతలు, హైడ్రాపై మాట్లాడారు. ఈ సందర్భంగా హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో అనేకమంది పెద్దలు ఫామ్‌హౌస్‌లు నిర్మించుకున్నారని అంటూ వారి పేర్లను ప్రస్తావించా రు. బీఆర్ఎస్ నేతలతోపాటు, కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రాంచందర్‌రావు పేరును ఆయన ఉదహరించారు. కేవీపీ అక్రమంగా ఫామ్‌హౌస్ నిర్మించుకున్నారని ఆరోపించా రు.
అనేక వివాదాస్పద ప్రాంతాల్లో అనేకమంది కాంగ్రెస్ నేతల నిర్మాణాలు ఉన్నా.. వారందరినీ వదిలిపెట్టి కేవలం సీనియర్ నేత కేవీపీ పేరునే ఉటంకించడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయ మైలేజీ కోసమే సీఎం సీనియర్లకు అక్రమాలు అంటగడుతున్నారని హస్తం నేతలు మండిపడుతున్నారు. గతంలో నూ సీనియర్ నేత శశిథరూర్‌ను రేవంత్‌రెడ్డి.. ‘ఆయన ఓ గాడిద. పార్టీ నుంచి బహిష్కరించాలి’ అని వ్యాఖ్యానించారు. ఆ తరువాత వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారని గుర్తుచేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత పల్లం రాజుకు చెందిన ఉస్మాన్‌సాగర్‌లోని ఫామ్‌హౌస్‌ను హైడ్రా కూల్చివేసింది. రేవంత్ మొదటి నుంచి సీనియర్ నేతల విషయంలో దుందుడుకుగా వ్యవహరిస్తున్నారని నేతలు మండిపడుతున్నారు.